‘స్మైల్ ప్లీజ్’..చంద్రుడిపై ల్యాండర్ ఫోటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్
గత నెలలో నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 సెప్టెంబర్ 23న చంద్రునిపై ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. మూన్‌పై సాఫ్ట్..
గత నెలలో నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 సెప్టెంబర్ 23న చంద్రునిపై ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. మూన్‌పై సాఫ్ట్ ల్యాండ్ కావడంతో ఇస్రో మరో చరిత్రను సృష్టించినట్లయ్యింది. విక్రమ్ ల్యాండ్ నుంచి బయటకు వచ్చిన రోవర్ తన పని విజవయవంతంగా కొనసాగిస్తోంది. చంద్రయాన్ -3 ల్యాండై వారం రోజులు పూర్తయ్యింది. ఇక రోవర్ చంద్రునిపై తిరుగుతూ కీలక సమాచారాన్ని సేకరిస్తోంది. 14 రోజుల కీలక సమాచారాన్ని సేకరించే రోవర్.. ఇప్పటికే చాలా విషయాలన్ని సేకరించి ఇస్రోకు పంపించింది. చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ పరిశోధన కొనసాగిస్తోంది. అయితే చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు పుష్కలంగా ఉన్నట్లు గుర్తించింది రోవర్. అలాగే చంద్రుడిపై పలు ఖనిజాలు జాడను గుర్తించింది ప్రజ్ఞాన్ రోవర్. మాంగనీస్, క్రోమియం, టైటానియం, కాల్షియం, అల్యూమినియం, సల్ఫర్, సిలికాన్, ఇనుము ఖనిజాల ఆనవాళ్లు గుర్తించింది. దీనికి సంబంధించిన ఫొటోలను అధికారికంగా విడుదల చేసింది ఇస్రో. హైడ్రోజన్ కోసం ఇంకా రోవర్ పరిశోధన కొనసాగుతోందని తెలిపింది ఇస్రో.ఇక మిగిలిన ఏడు రోజుల్లో చందమామపై ల్యాండర్, రోవర్ మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు చేస్తాయి. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావాన్ని విశ్లేషిస్తుంది. అలాగే చంద్రుడిపై ఉన్న దుమ్ము ధూళీ, రాళ్లలోని రసాయనిక సమ్మేళనాలను రోవర్ గుర్తిస్తుంది
స్మైల్ ప్లీజ్..
అయితే ప్రజ్ఞాన్ రోవర్ క్లిక్ చేసిన విక్రమ్ ల్యాండర్ చిత్రాలను ఇస్రో షేర్ చేసింది. దీనితో పాటు స్మైల్ ప్లీజ్ అనే క్యాప్షన్ ఇస్తూ ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రుని దక్షిణ భాగంలో ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికిని గుర్తించడం పెద్ద విజయమని ఇస్రో చెబుతోంది. ప్రజ్ఞాన్ రోవర్ నిన్నఉదయం విక్రమ్ ల్యాండర్ చిత్రాలను క్లిక్‌మనిపించింది. ఈ ఫోటోలు ప్రజ్ఞాన్ రోవర్ నావిగేషన్ కెమెరా (NavCam) ద్వారా గుర్తించింది. ఈ NavCam కెమెరాను లేబొరేటరీ ఫర్ ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ (LEOS) తయారు చేసింది. ఇస్రో ప్రకారం.. ఈ చిత్రాలు భారత కాలమానం ప్రకారం ఆగస్టు 30 ఉదయం 7.35 గంటలకు తీసింది.
చంద్రయాన్-3ని దక్షిణ ధృవం ప్రాంతంలో ల్యాండ్ చేసిన ప్రపంచంలోని మొదటి దేశంగా భారతదేశం అవతరించింది. అలాగే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోని నాల్గవ దేశంగా కూడా నిలిచింది. భారతదేశానికి ముందు అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ విజయవంతంగా చంద్రునిపై ల్యాండింగ్ చేశాయి.