Sat Nov 16 2024 22:50:09 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ కో-బ్రదర్ కు మొండి చేయ్యేనా?
శ్రీ భరత్ రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంలో పడేలా ఉంది. ఆయనకు వచ్చే ఎన్నికలలో టిక్కెట్ దొరకడం కష్టంగానే మారింది
శ్రీభరత్.. లోకేష్ కో బ్రదర్.. బాలకృష్ణ అల్లుడు. ఆయన రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంలో పడేలా ఉంది. శ్రీభరత్ గీతం వ్యవస్థాపకులు ఎంవీవీఎస్ మూర్తి, మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మనవడు కూడా. మూర్తి మరణం తర్వాత శ్రీభరత్ గీతం విద్యాసంస్థల బాధ్యతను చేపట్టారు. రాజకీయ వారసత్వాన్ని కూడా అందుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరుపున గత ఎన్నికల్లో విశాఖ పార్లమెంటుకు శ్రీభరత్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
పొత్తుల్లో భాగంగా...
గత ఎన్నికలలో శ్రీభరత్ ఓటమిపాలు కావడానికి తెలుగుదేశం పార్టీలోని కొందరు కారణమని ఆయన భావించారు. కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా తర్వాత క్రమంగా చేరువయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ గానే ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు టిక్కెట్ శ్రీభరత్ కు దక్కుతుందా? లేదా? అన్నది సందేహంగానే ఉంది. ఎందుకంటే ఈసారి తెలుగుదేశం పార్టీ పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లనుంది.
ఏ పార్టీతో పొత్తు ఉన్నా...
జనసేనతో పొత్తు పెట్టుకున్నా, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా విశాఖ స్థానాన్ని వారికి వదిలేయాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయన జనసేన నుంచి బయటకు వచ్చారు. బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పురంద్రీశ్వరి పోటీ చేశారు. జనసేనతో పొత్తు ఉన్నా ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు వదిలేయాల్సి ఉంది. ఖచ్చితంగా అదే జరుగుతుందన్న అంచనా వినిపిస్తుంది.
ఎమ్మెల్యే అభ్యర్థిగానైనా...?
ఈ నేపథ్యంలో శ్రీభరత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నందమూరి కుటుంబానికి అన్యాయం జరిగిందన్న విమర్శలున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కొన్ని కీలకమైన సీట్లు కూడా వదులుకోవడానికి సిద్దపడుతున్నారు. అందుకే శ్రీభరత్ పోటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునివ్వడం కూడా అనుమానాలకు మరింత బలపరుస్తుంది. మరి శ్రీభరత్ భీమిలి వంటి అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంపిక చేసుకుంటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
- Tags
- sri bharath
- tdp
Next Story