Tue Dec 24 2024 12:54:07 GMT+0000 (Coordinated Universal Time)
ఊరు పేరు "జానకీ"పురం.. రాజయ్యా? మరిస్తే ఎలా?
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రతి దఫా ఏదో వివాదంలో చిక్కుకుంటున్నారు.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రతి దఫా ఏదో వివాదంలో చిక్కుకుంటున్నారు. తొలి దఫా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవి, వైద్య ఆరోగ్య వంటి ప్రతిష్టాత్మకమైన శాఖను కేసీఆర్ ఇచ్చినా రాజయ్య అది నిలుపుకో లేకపోయారు. అవినీతి ఆరోపణలతో ఆయన మంత్రివర్గం నుంచి తొలిసారి బర్త్‌రఫ్ అయ్యారు. అయినా 2018 ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టిక్కెట్ ను తిరిగి రాజయ్యకే కేసీఆర్ కేటాయించారు. కానీ అది కూడా ఆయన నిలుపుకోలేని బలహీన పరిస్థితికి వెళ్లిపోయారు. ఒక మహిళ సర్పంచ్ పై లైంగిక వేధింపులకు పాల్పడటం నిజంగా సిగ్గుచేటు. అయితే ఆ వివాదాన్ని పెద్దల జోక్యంతో పరిష్కరించుకున్నా రాజయ్యకు మాత్రం ఆ మచ్చ తొలిగే ఛాన్స్ ఉండకపోవచ్చు.
నాలుగుసార్లు గెలిపించి...
నిజానికి రాజయ్య లాంటి నేతకు రెండోసారి మంత్రివర్గంలోనైనా కేసీఆర్ స్థానం కల్పించి ఉండాల్సిందన్న కామెంట్స్ నిన్న మొన్నటి వరకూ వినిపించాయి. కానీ దళిత మహిళ సర్పంచ్ పట్ల ఆయన అనుసరించిన వైఖరితో ఆ మాత్రం సానుభూతి కూడా తుడుచు పెట్టుకుపోయింది. స్టేషన్ ఘన్పూర్ ప్రజలు రాజయ్యను గుండెలో పెట్టుకున్నారు. వరసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. 2009, 2012 ఉప ఎన్నిక, 2014, 2018 ఎన్నికల్లో రాజయ్య వరసగా గెలిచారు. అంటే నాలుగు సార్లు ఆయన ప్రజామోదం పొందారు. ప్రజలు అలా ఆదరించినప్పుడు ఎలా వ్యవహరించాలి? అందరిని కలుపుకుని వెళ్లాలి. ఎవరినీ నొప్పించకూడదు. వీలయితే ప్రత్యర్థులను సయితం ఆకట్టుకోవాలి.
ఎన్నికల ఏడాది కావడంతో...
కానీ జానకీపురం సర్పంచ్ నవ్య విషయంలో రాజయ్య వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన. దళిత మహిళ సర్పంచ్ పై లైంగిక వేధింపులకు పాల్పడటం క్షమించరాని నేరం. అయితే ఇది ఎన్నికల ఏడాది కావడంతోనే రాజయ్య దిగివచ్చారన్నది అనేక మంది మాట. పార్టీ హైకమాండ్ కూడా మొట్టికాయలు వేయడంతో రాజయ్య హడావిడిగా సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి క్షమించాలని వేడుకోవాల్సి వచ్చింది. తాను తెలియక చేసిన తప్పును క్షమించాలని కోరారు. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని, తాను తప్పు చేశానని భావిస్తే మహిళలందరూ క్షమించాలంటూ రాజయ్య వేడుకోవాల్సిన పరిస్థిత తలెత్తింది. నిజానికి ఈ విషయంలో దళిత సర్పంచ్ నవ్యను అభినందించి తీరాల్సిందే.
శభాష్ నవ్యా...
సొంతపార్టీ అని కూడా చూడకుండా సాక్షాత్తూ ఎమ్మెల్యేపైనే ఆమె పోరాటానికి దిగారు. నవ్య వద్ద పూర్తి ఆధారాలుండటంతోనే రాజయ్య తలవొంచక తప్పని పరిస్థితి వచ్చిందనేవాళ్లు లేకపోలేదు. ఈ విషయాన్ని నవ్య తన గ్రామ అభివృద్ధికి టర్న్ చేయడం కూడా అందరి ప్రశంసలను అందుకుంటుంది. తన గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలంటూ మీడియా ముందే రాజయ్యను కోరడంతో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాకుండా జానకీపురం గ్రామానికి ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే మంజూరు చేయడం కూడా ప్రశంసలు అందుకుంది. జానకీపురంలోనే రామాయణ గాధలో సీత గుర్తుకు రాలేదా? అన్న ప్రశ్నలు కూడా రాజయ్యకు ఎదురవుతున్నాయి.రాజకీయాల్లోకి వచ్చిన మహిళలను చులకనగా చూసే వారికి రాజయ్య ఘటన ఒక గుణపాఠంగా చెప్పాలి.
Next Story