స్టాట్యూ ఆఫ్ యూనిటీ విశేషాలు ఇవే..!
ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం నేడు ప్రారంభం కాబోతోంది. 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయించి దేశానికి ఒక రూపు తీసుకువచ్చిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అరుదైన గౌరవం లభించనుంది. ఆయన కీర్తిని ప్రపంచానికి చాటేలా గుజరాత్ లోని నర్మదా నది ఒడ్డున 182 మీటర్లు భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహాన్ని ఇవాళ ఆయన జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ విగ్రహానికి సంబంధించిన విశేషాలు తెలుగుపోస్ట్ పాఠకుల కోసం...
- అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి రెండింతలు ఎత్తైన ఈ విగ్రహం.
- రికార్డు స్థాయిలో 33 నెలల్లో విగ్రహ నిర్మాణం పూర్తయింది. అదే చైనాలోని 153 మీటర్లు స్ప్రింగ్ టెంపుల్ బుద్ధుడి విగ్రహ నిర్మాణానికి 11 సంవత్సరాలు పట్టింది.
- ఎల్ ఆండ్ టీ సంస్థ నిర్మించిన ఈ విగ్రహానికి రూ.2,989 కోట్లు ఖర్చయింది. విగ్రహ నిర్మాణానికి 70 వేల టన్నుల సిమెంటును, 18,500 టన్నుల ఇనుము, 1700 మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని ఉపయోగించారు.
- విగ్రహం వద్ద పర్యాటకుల కోసం రెండు లిఫ్టులు ఏర్పాటుచేశారు. వీటి ద్వారా పటేల్ విగ్రహం ఛాతి భాగం వరకు వెళ్లవచ్చు. ఒకేసారి 200 మంది వరకు అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేశారు.
- గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు సంభవించినా, 6.5 తీవ్రతతో భూకంపాలు వచ్చిన విగ్రహానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా నిర్మించారు.
- అచ్చం పటేల్ ను తలపించేలా విగ్రహం ఉండేందుకు చాలా కష్టపడ్డారు. విగ్రహాన్ని రూపొందించిన నోయిడాకు చెందిన రామ్ సుతార్ ఇందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పటేల్ కు చెందిన 2000 ఫోటోలను పరిశీలించారు. పటేల్ ను ప్రత్యక్షంగా చూసిన పలువురిని కలిశారు.
- దూరం నుంచి చూస్తే నర్మదా నదిలో పటేల్ నడుస్తున్నట్లుగా విగ్రహం ఉంటుంది.
- కవాడియా అనే పట్టణం నుంచి విగ్రహం వద్దకు పర్యాటకులు చేరుకునేందుకు గుజరాత్ ప్రభుత్వం మూడున్నర కిలోమీటర్లు ప్రత్యేక రోడ్డు వేశారు.