సుజనాకు చుక్కెదురు....!!!
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి హైకోర్టులో చుక్కెదురయింది. సుజనా చౌదరిపై ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆయన 5700 కోట్ల రూపాయల మేరకు బ్యాంకులను మోసగించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఈ నెల 27వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని సుజనా చౌదరికి ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే సుజనా చౌదరి మాత్రం తనను కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు కేసులు పెడుతున్నారని హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీ సర్కార్ వేధింపుల్లో భాగంగానే తనపై ఈడీ దాడులు చేయిస్తుందని, ఈడీ హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారించిన హైకోర్టు సుజనా వాదనను తిరస్కరించింది. వచ్చే సోమవారం ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఆయనపై ఎటువంటి నిర్భంధ చర్యలు తీసుకోకూడదని ఈడీని హైకోర్టు ఆదేశించింది.