Mon Dec 23 2024 13:31:59 GMT+0000 (Coordinated Universal Time)
పోటీకి దూరమైనా.. బొబ్బిలి ఈసారి టీడీపీదేనా?
సుజయ కృష్ణ రంగారావు రాజకీయాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లుంది. అందుకే సోదరుడు బేబినాయనను ప్రోత్సహిస్తున్నారు
బొబ్బిలి నియోజకవర్గంలో రాజులకు ఉన్న ప్రాముఖ్యత మరెవ్వరికీ ఉండదు. వారిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు వినిపించవు. తమ ఆస్తులను ప్రజల కోసం పోగొట్టుకున్న కుటుంబాలు కావడంతో బొబ్బిలి రాజుల పట్ల ఆ ప్రాంతంలో సానుకూలత ఉందనే చెప్పాలి. బొబ్బిలి రాజుల వారసత్వంలో కొత్త తరం వచ్చిన తర్వాత బొబ్బిలి బద్రర్స్ ఎక్కువగా చెన్నై, విశాఖపట్నం నగరాలకే పరిమితమయ్యారు. ఎప్పుడైనా అకేషన్ లకు తప్పించి బొబ్బిలి వచ్చే వారు కారు. అయినా ఆ కుటుంబం అంటే ప్రజలకు గౌరవం. భక్తి కూడా. అందుకే 2004 ఎన్నికల్లో బొబ్బిలి రాజులు రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
హ్యాట్రిక్ విజయాలు సాధించి....
2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున సుజయ కృష్ణ రంగారావు పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుజయ కృష్ణ రంగారావు విజయం సాధించి హ్యాట్రిక్ విక్టరీని కొట్టారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. చంద్రబాబు మంత్రి వర్గంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుజయ కృష్ణ రంగారావు దాదాపు ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థి శంబంగి చిన అప్పలనాయుడు పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
బొబ్బిలికి దూరంగా...
2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో రాజకీయంగా సుజయ కృష్ణ రంగారావు చాలా వరకు వెనక్కు తగ్గారు. ఆయన బొబ్బిలిలో కూడా పెద్దగా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్న సమయంలోనూ ఆయన పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కువ సమయం విశాఖలోనే గడుపుతున్నారు. ఇది గమనించిన పార్టీ అధినాయకత్వం ఇన్ఛార్జి పదవి నుంచి సుజయ కృష్ణ రంగారావును తప్పించింది. ఆయన స్థానంలో సుజయ సోదరుడు బేబినాయనకు అప్పగించింది.
బేబినాయన స్పీడ్ తో...
బేబినాయన దూకుడుతో వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఊపు తెస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టిక్కెట్ బేబినాయనకే ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సుజయ కృష్ణ రంగారావు రాజకీయాలకు దూరంగా ఉండేందుకే డిసైడ్ అయినట్లుంది. అందుకే సోదరుడు బేబినాయనను రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. నియోజకవర్గంలో బేబినాయన అన్నా కాంటిన్లు వంటివి ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోనూ బొబ్బిలిలో టీడీపీ అత్యధిక స్థానాలను సాధించడం వెనక బేబినాయన కృషి ఉంది. అందుకే సుజయ కృష్ణ రంగారావు పూర్తిగా బొబ్బిలి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనని అంటున్నారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేపై కొంత వ్యతిరేకత ఉండటంతో వచ్చే ఎన్నికల్లో తిరిగి బొబ్బిలి రాజులకే జనం జై కొడతారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Next Story