Mon Dec 23 2024 17:29:05 GMT+0000 (Coordinated Universal Time)
రూటు మ్యాప్ అంతా ఆయనదేనట
ఎవరు అవునన్నా కాదన్నా సునీల్ దేవధర్ కు బీజేపీ హైకమాండ్ వద్ద ఒక గౌరవం ఉంది. ఆయన మాటకు విలువ ఉంది.
ఎవరు అవునన్నా కాదన్నా సునీల్ దేవధర్ కు బీజేపీ హైకమాండ్ వద్ద ఒక గౌరవం ఉంది. ఆయన మాటకు విలువ ఉంది. మధ్యలో చేరిన వాళ్లు సునీల్ దేవధర్ పై ఎన్ని విమర్శలు చేసినా, ఆయనపై ఎన్ని పితూరీలు చెప్పడానికి ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఉండదు. ఆ సంగతి తెలియక సునీల్ దేవధర్ పై కొందరు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలు ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ దేవధర్ మాత్రం చిరునవ్వుతోనే తన సమాధానం ఇదీ అని వారికి చెప్పకనే చెబుతుంటారు.
ఆషామాషీ నేత కాదు....
సునీల్ దేవధర్ ను ఏపీకి ఇన్ ఛార్జిగా పంపింది ఊరికే కాదు. ఆయన ఆషామాషీ నేత కాదు. ఆయన ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీని అధికారంలోకి తెచ్చిన మంచి వ్యూహకర్త. ఏపీలో ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలన్న ఆశ బీజేపీ హైకమాండ్ కు లేదు. అందుకే ఆయనను పార్టీని బలోపేతం చేసేందుకు ఏపీకి ఇన్ ఛార్జిగా పంపారంటారు. సునీల్ దేవధర్ తొలి నుంచి వైసీపీ, టీడీపీలకు వ్యతిరేకంగానే ఉన్నారు.
టీడీపీని బలహీనపరిస్తేనే....
తెలుగుదేశం పార్టీని బలహీనం చేయగలితేనే తమకు ఏపీలో పొలిటకల్ స్పేస్ దొరుకుతుందని ఆయన భావిస్తారు. అందుకే సునీల్ దేవధర్ తరచూ టీడీపీని తమ పార్టీ దరిదాపుల్లోకి కూడా రానివ్వమంటుంటారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని, హైకమాండ్ ప్రతినిధిగానే తాను చెబుతున్నానని ఆయన ఒకింత గట్టిగానే చెప్పారు. కానీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లాంటి వారికి ఆయన మాటలు రుచించలేదు. దీంతో ఆయన వ్యాఖ్యలను ఖండించారు. అయితే తాజాగా జనసేన పార్టీ అధినేత బీజేపీ హైకమాండ్ పంపే రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు.
రోడ్డు మ్యాప్ సిద్ధమట....
కానీ సునీల్ దేవధర్ ఆల్రెడీ రోడ్డు మ్యాప్ సిద్ధం చేసి ఉంచారని పార్టీలో నేతలు చెబుతున్నారు. టీడీపీతో పొత్తుకు ఎట్టిపరిస్థితుల్లో బీజేపీ హైకమాండ్ అంగీకరించదంటున్నారు. చంద్రబాబు తమను అనేక సార్లు మోసం చేసి వెళ్లిపోయారని, మరోసారి ఆయన చేతిలో మోస పోవడం ఇష్టం లేదని సునీల్ దేవధర్ అన్నట్లు తెలిసింది. అయితే జనసేనతోనే తమ ప్రయాణం ఉంటుందని, రేపటి ఎన్నికలు కాకపోయినా ఆ తర్వాత అయినా టీడీపీ స్థానం తాము ఆక్రమిస్తామని ఆయన చెబుతున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ కు రోడ్డు మ్యాప్ సునీల్ దేవధర్ రెడీ చేస్తున్నారట.
- Tags
- sunil deodhar
- bjp
Next Story