Mon Dec 23 2024 20:04:22 GMT+0000 (Coordinated Universal Time)
కల చెదిరింది.. కన్నీరే ఇక మిగిలింది
సూపర్ స్టార్ కృష్ణ మరణం టాలీవుడ్ లో విషాదం నింపింది. ఆయన మరణంతో ఒక శకం ముగిసింది.
తెలుగు సినిమా చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల శకం ముగిసింది. ఆ శకానికి గుర్తుగా నిన్నటి వరకూ సూపర్ స్టార్ కృష్ణ మనముందు ఉన్నారు. ఆయన టాలీవుడ్ కు భరోసాగా నిలిచారు. అలాంటి కృష్ణ మరణంతో టాలీవుడ్ లో ఒక దిగ్గజాన్ని కోల్పోయినట్లయింది. కృష్ణ అంటే ఈ జనరేషన్ కు పూర్తిగా తెలియకపోవచ్చు. ఒకప్పుడు కృష్ణ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఎంతో సందడి. ముఖ్యంగా అభిమానుల్లో ఎంతో ఉత్సాహం. ఆయన చిత్ర రంగంలో అన్నింటా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించారు.
కృష్ణ అంటేనే...టేనే...
ఆరోజుల్లో ఎవరైనా హీరోలు కృష్ణ సినిమాలు రిలీజ్ కాకుండా చూసి తమ సినిమాలు విడుదల చేసుకునే రోజులు కూడా ఉన్నాయి. కృష్ణది సినిమాల వరకూ ఎవరినీ లెక్క చేయని మనస్తత్వం. ఏఎన్నార్ దేవదాస్ సినిమా తీశారని, తాను కూడా అదే సినిమాను తీశారు. ఎన్టీఆర్ రాముడిగా, కృష్ణుడిగా, అర్జునుడిగా వెలుగుతున్న రోజుల్లో దానవీర శూర కర్ణ సినిమా తీస్తే తాను కూడా ఏమాత్రం తీసిపోనని అదే స్థాయిలో కురుక్షేత్రం సినిమా తీశారు. సినీరంగంలో వచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకున్నది కృష్ణ మాత్రమే. ఆరోజుల్లో మిగిలిన ఏ హీరోలు అయినా ఒక క్యారెక్టర్ తో సక్సెస్ అయితే.. అదే క్యారెక్టర్ తో తాను ఎందుకు సినిమా తీయలేనని ఆలోచించి హిట్ కొట్టడం కృష్ణ ఒక్కరికే సొంతం.
ఎవరికీ భయపడని...
కృష్ణ ఎవరికీ భయపడరు. తాను అనుకున్నది చేస్తారు. తనకు సినీ రంగంలో ఎవరు నచ్చకపోయినా నిర్మొహమాటంగా వెంటనే నిర్ణయం తీసుకుంటారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో వచ్చిన స్వల్ప విభేదాలతో ఆయన వెంటనే రాజసీతారాంతో తన సినిమాలో పాటలు పాడించుకుని మరీ హిట్ కొట్టారు. దటీజ్ కృష్ణ. కృష్ణకు ఆరోజుల్లోనే రికార్డు స్థాయిలో అభిమాన సంఘాలుండేవి. కృష్ణ ఇతర హీరోలు నటించిన దేవదాస్ వంటి సినిమాలు తీసినా నాటి హీరోలు మాత్రం కృష్ణ తీసిన అల్లూరి సీతారామరాజు, మోసగాళ్లకు మోసగాడు వంటి సినిమాలు తీయలేకపోయారు. అదే సూపర్ స్టార్ కృష్ణ స్పెషాలిటీ. కృష్ణ సినిమా పోస్టర్లు కూడా విభిన్నంగా ఉండేవి. పోస్టర్ ను చూసి ఇతర హీరోల అభిమానులు కూడా కృష్ణ సినిమాకు వెళ్లేవారింటే అతిశయోక్తి కాదు.
ప్రయోగాలకు పుట్టిల్లు...
తెలుగు చలనచిత్ర రంగంలో ఎటువంటి నూతన ఆవిష్కరణలు జరిగినా అవి కృష్ణ సిినిమాతోనే ప్రారంభమయ్యేవి. 352 చిత్రాలకు పైగ నటించారు. ఇక టాలివుడ్ లో జేమ్స్ బాండ్ అంటే కృష్ణ మాత్రమే కనపడతారు. వెండి తెరపై ప్రయోగ శాల కేరాఫ్ కృష్ణ ఇల్లు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గూఢాచారి 116, మోసగాళ్లకు మోసగాడు వంటి సినిమాలతో లక్షల సంఖ్యలో అభిమానులను కృష్ణ తన సొంతం చేసుకున్నారు. 14 ఏళ్ల పాటు ఎలాంటి గ్యాప్ లేకుండా కృష్ణ నటించారు. 70 ఎంఎం, డీటీఎస్, స్కోప్ సినిమాలకు ఆద్యుడు కృష్ణయే.
కాంబినేషన్ సూపర్ హిట్...
ఇక హీరోయిన్ ల ఎంపికలోనూ కృష్ణది విశిష్ణ శైలి. కృష్ణ - జయప్రద, కృష్ణ - శ్రీదేవి, కృష్ణ - విజయనిర్మల కాంబినేషన్ ఆరోజుల్లో సూపర్ హిట్. ఎన్టీఆర్ తో దేవుడు చేసిన మనుషులు సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. శోభన్ బాబు, కృష్ణంరాజులతో కలసి నటించారు. ఆయన సినిమాయే ఊపిరిగా జీవించారు. ఆయనతో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కట్టేవారంటే అతిశయోక్తి కాదు. తేనెమనసులో ప్రారంభించిన తన సినీ జీవితంలో ఎక్కడా కృష్ణ వెనుదిరిగి చూడలేదు. సాహసానికి ఆయన మరోపేరు. ఈస్ట్ మన్ కలర్ నుంచి ఎన్నో ప్రయోగాలను చేసిన ఘనత కృష్ణకే చెల్లుతుంది.
వ్యక్తిగత జీవితంలోనూ...
వ్యక్తిగత జీవితంలోనూ ఆయన డేరింగ్ నిర్ణయాలు తీసుకునే వారు. ఎవరో ఏదో అనుకుంటారని భయపడరు. ఆరోజుల్లోనే తనకు పెళ్లయి కుటుంబం ఉన్నా విజయనిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందుకే కృష్ణ కు 2,500 సినిమా అభిమాన సంఘాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. 2009లో కృష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. కృష్ణ తాను చేయని క్యారెక్టర్ లేదు. తీయని సినిమా లేదు. టాలీవుడ్ కు ఒక గుర్తింపు తెచ్చిన ఘనత కృష్ణదేనని చెప్పడానికి ఎవరూ వెనకాడరు.
రాజకీయాల్లోనూ...
ఇక రాజకీయ జీవితంలో కూడా కృష్ణది ఒక ప్రత్యేకత. రాజీవ్ గాంధీతో సాన్నిహిత్యం ఆయనను రాజకీయాల్లోకి రప్పించిందంటారు.1984లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో ఏలూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. రాజీవ్ హత్య తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారంటారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినా తాను కాంగ్రెస్ వెంట నడిచారు. పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. రాజకీయాల్లో ఎక్కువ కాలం లేకపోయినా ఆయన చివరి వరకూ కాంగ్రెస్ కు అండగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కృష్ణ అంటే పిచ్చి అభిమానం.
ఎన్నో సాహసాలు...
గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించిన కృష్ణ తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేశారు. ఎన్నో ప్రయోగాలు.. ఎన్నో క్యారెక్టర్లు.. ఎన్నో సాహసాలు... పద్మాలయా స్టూడియోస్ నిర్మించారు. తాను సొంతంగా పద్మలయా స్టూడియోస్ ను ఏర్పాటు చేసుకుని వందల సంఖ్యలో సినిమాలు నిర్మించారు. కృష్ణ మరణం టాలీవుడ్ కు తీరని లోటని చెప్పాలి. తెలుగు సినిమాలకు ఎందరినో పరిచయం చేసిన కృష్ణ మరణంతో ఒక శకం ముగిసింది. కృష్ణ అంటేనే వెండి తెర. వెండి తెర అంటేనే కృష్ణ. కృష్ణ మరణంతో ఒక్క టాలీవుడ్ కే కాదు.. ఆయన అభిమానులెందరికో ఇది చేదువార్త. వియ్ మిస్ యూ సూపర్ స్టార్.
Next Story