Mon Dec 23 2024 12:59:22 GMT+0000 (Coordinated Universal Time)
గుర్తులతోనే గుండె దడ... ముంచేస్తాయా?
గుర్తులు పార్టీలను భయపెడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. ఇక పోలింగ్ కు గంటల సమయం మాత్రమే ఉంది. ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఇంటింటికి వెళ్లి కలుసుకుని అభ్యర్థించుకునే పనిలో పడ్డాయి. మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా నిఘా పెట్టింది. ఓటర్లకు డబ్బులు పంచకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ప్రకటించుకున్నారు. కానీ వెళ్లాల్సిన దారిలో అవి వెళుతున్నాయని రాజకీయ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. చెక్పోస్టుల వద్ద ఇంకా డబ్బులు దొరుకుతూనే ఉన్నాయి. చివరి నిమిషం వరకూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నం చేస్తాయి.
47 మంది అభ్యర్థులు...
అయితే ఇప్పుడు గుర్తులు పార్టీలను భయపెడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. వీరికి అనేక గుర్తులను ఎన్నికల కమిషన్ కేటాయించింది. అయితే కొన్ని గుర్తులు తమ పార్టీకి చెందినవిగా పోలి ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గుర్తుల భయం పట్టుకుంది. అందుకే అభ్యర్థుల పేర్లను, నెంబర్లను ఓటర్ల చెంతకు తీసుకెళ్లేందుకు అభ్యర్థుల ప్రయత్నిస్తున్నారు. చివరి రోజు కూడా తమ నెంబరుతో పాటు గుర్తు, పేరును పదే పదే ఓటర్లకు చెబుతూ మరో గుర్తుకు తమ ఓటు వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కారు గుర్తు పోలిన...
అధికార టీఆర్ఎస్ గుర్తు కారు అయితే, అదే గుర్తు పోలిన రోడ్డు రోలర్ గుర్తును కూడా మరో అభ్యర్థికి కేటాయించింది. దీంతో నెంబరు పైనే ఓటు వేయాలని ప్రజలను టీఆర్ఎస్ ప్రధానంగా కోరుతుంది. రోడ్డు రోలర్, బోట్, చపాతీ రోలర్ వంటి గుర్తులు కూడా ఉన్నాయి. గతంలో అనేక ఎన్నికల్లో గుర్తుల కారణంగానే తక్కువ ఓట్లతో ఓటమి పాలయిన సందర్భాలున్నాయి. గుర్తుల కేటాయింపుపై టీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేదు. కొన్ని గుర్తులను ఎన్నికల కమిషన్ అనుమతించడంతో టీఆర్ఎస్ అభ్యర్థి గుండెల్లో దడ మొదలయింది.
నెంబరు మీదనే ప్రచారం...
సాధారణంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు గుర్తునే ఎక్కువగా గుర్తించి దానిపైనే ఓటు వేస్తారు. అభ్యర్థి పేరు చదివేందుకు కొందరికి అవకాశం లేకపోవడంతో గుర్తులపైనే ఆధారపడతారు. ఇది ఒక్క టీఆర్ఎస్ కే కాదు. అన్ని పార్టీలకు అదే రకమైన ఇబ్బందులున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే గుర్తు కంటే నెంబరు పైనే ఇప్పుడు ఎక్కువగా అభ్యర్థులు ప్రచారాన్ని చేసుకుంటున్నారు. ఇక పోలింగ్ కు పెద్దగా సమయం లేకపోవడంతో గుర్తులతో తమ విజయానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి. గుర్తులు మాత్రం అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయనే చెప్పాలి.
Next Story