Sun Nov 24 2024 16:30:11 GMT+0000 (Coordinated Universal Time)
సౌత్ కీ బాత్...గవర్నర్ vs గవర్నమెంట్
గవర్నర్లు వ్యవస్థ మరోసారి భారత్ లో చర్చనీయాంశమైంది. దక్షిణాది రాష్ట్రాలో గవర్నర్, గవర్నమెంట్ మధ్య యుద్ధమే నడుస్తుంది.
గవర్నర్లు వ్యవస్థ మరోసారి భారత్ లో చర్చనీయాంశమైంది. దక్షిణాది రాష్ట్రాలో గవర్నర్, గవర్నమెంట్ మధ్య యుద్ధమే నడుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఇటీవల కాలంలో వివాదంగా మారుతున్నారు. వారు తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా మూడు రాష్ట్రాల గవర్నర్లపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు గుర్రుమంటున్నాయి. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిరసనలను తెలియజేస్తున్నాయి. అయితే గవర్నర్లు మాత్రం తాము అనుకున్న అజెండాను మాత్రమే అమలు చేయడానికి సిద్ధం అవుతుండటంతో రెండు వ్యవస్థల మధ్య అంతరం పెరుగుతుంది. యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బిల్లును తమిళిసై పెండింగ్ లో పెట్టారు.
బిల్లులన్నీ పెండింగ్ లో...
తెలంగాణ గవర్నర్ తమిళిసైకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య ఏడాది కాలంగా పొసగడం లేదు. చివరకు బడ్జెట్ ప్రసంగానికి కూడా ఆహ్వానించలేదు. అంతేకాదు రాజ్్భవన్ లో జరిగే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు దూరంగా ఉంటున్నారు. దీనికి విరుగుడుగా గవర్నర్ తమిళి సై ప్రజా దర్బార్ లను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా బిల్లులను పెండింగ్ లో పెడుతున్నారు. అధికారుల నుంచి క్లారిటీ కావాలని కోరుతున్నారు. గవర్నర్ పర్యటన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ కూడా పాటించడం లేదు. దీంతో రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య మరింత దూరం పెరిగింది.
వైస్ ఛాన్సిలర్ల ...
ఇక కేరళలోనూ అంతే. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఆగ్రహంతో ఉన్నారు. యూనివర్సిటీ ఛాన్సిలర్ల నియామకంలో ఈ వివాదం తలెత్తింది. వైస్ ఛాన్సిలర్లు అందరూ తొలగాలని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కోరడంతో వారు న్యాయస్థానానన్ని ఆశ్రయించారు. వైస్ ఛాన్సిలర్లు ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటున్నారని గవర్నర్ అభిప్రాయపడుతున్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వంపై గవర్నర్ పెత్తనమేంటని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. గత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు డాక్టరేట్ ఇచ్చే విషయంలో ఈ వివాదం తలెత్తింది. అది చినికి చినికి గాలివానలా మారింది. చివరకు వైస్ ఛాన్సిలర్లందరూ రాజీనామా చేయాలని గవర్నర్ వత్తిడి తేవడం, అందుకు వాళ్లు ససేమిరా అనడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రపతికి లేఖ...
తమిళనాడులోనూ గవర్నర్, గవర్నమెంటు మధ్య పెద్ద వార్ నడుస్తుంది. గవర్నర్ ఆర్ఎస్ రవి పై డీఎంకే ప్రభుత్వం ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాసింది. ఈ గవర్నర్ మాకొద్దు అంటూ డిమాండ్ చేసింది. గవర్నర్ ప్రకటనలు ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచే విధంగా ఉన్నాయని డీఎంకే ఆరోపిస్తుంది. అనేక బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని స్టాలిన్ సర్కార్ ఆరోపిస్తుంది. ప్రభుత్వాన్ని పనిచేయనివ్వకుండా గవర్నర్ అడ్డుతగులుతున్నారని డీఎంకే విమర్శలు చేస్తుంది. ఈ గవర్నర్ ను వెంటనే రీకాల్ చేయాలంటూ డిమాండ్ చేస్తుంది. ఇలా దక్షిణాదిలో మూడు రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ గా వార్ నడుస్తుంది.
Next Story