Sun Dec 29 2024 14:21:17 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ కోసం స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 21 పార్టీ నేతలతో సమావేశం జరుపుతున్నారు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 21 పార్టీ నేతలతో సమావేశం జరుపుతున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో ఆయన సమావేశం జరుపుతున్నారు. బీజేపీని వచ్చే ఎన్నికల్లో అందరూ కలసి ఓడించేందుకు ఒక్కటయ్యే విధంగా స్టాలిన్ ఈ సమావేశం నిర్వహిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే 21 పార్టీలకు ఆహ్వానాలు వెళ్లాయి. బీజేపీని వ్యతిరేకించే పార్టీలను కలుపుకుని వెళ్లాలన్నది స్టాలిన్ ప్రయత్నం. బీజేపీ నియంతృత్వ పోకడలను నిరసిస్తూ స్టాలిన్ ఈ సమావేశంలో అందరినీ ఏకం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసేందుకు స్టాలిన్ ముందుకు వచ్చారు.
దక్షిణ బారత్‌లో...
దక్షిణ భారతదేశంలో స్టాలిన్ బలమైన నేతగా ఉన్నారు. గవర్నర్‌తో విభేదాలు, బలవంతంగా హిందీ భాషను రుద్దడాన్ని వ్యతిరేకించడం వంటి వాటితో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి శత్రువుగా మారారు. బీజేపీని అన్ని రకాలుగా విభేదిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి స్టాలిన్ నమ్మకమైన మిత్రుడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. డీఎంకేతోనే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. రాహుల్ ప్రధాని కావాలని స్టాలిన్ కూడా ఆశిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో తాను ప్రత్యేకంగా పాత్ర పోషించుకోక పోయినా రాహుల్ కోసం స్టాలిన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
అనుకూల వేదికను...
అన్ని పార్టీలను ఏకం చేసి కాంగ్రెస్‌కు అనుకూలంగా గ్రౌండ్‌ను తయారు చేయాలన్నది స్టాలిన్ ఆలోచనగా కనిపిస్తుంది. స్టాలిన్ ఆహ్వానించిన 21 పార్టీల నేతలు హాజరయ్యే అవకాశముంది. ఎందుకంటే స్టాలిన్ తో ఎవరికీ ఎలాంటి విభేదాలు. బేధాభిప్రాయాలు లేవు. అందుకే ఈ సమావేశానికి ఆహ్వానించిన వారంతా హాజరవుతారంటున్నారు. ఈ మీటింగ్ సక్సెస్ అయితే కాంగ్రెస్ అనుకూల వాతావరణాన్ని స్టాలిన్ కల్పించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మీటింగ్ కు జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలనుకుంటున్న మమత బెనర్జీ, కేసీఆర్, కేజ్రీవాల్‌లకు కూడా స్టాలిన్ ఆహ్వానాలు పంపారు. వీరందరూ బీజేపీతో పాటు కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారే కావడంతో వారిని ఏకతాటిపైకి తేవాలన్నదే స్టాలిన్ ప్రయత్నం.
ఏపీ నేతలకు మాత్రం...
అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఏ రాజకీయ పార్టీని స్టాలిన్ ఈ సమావేశానికి ఆహ్వానం పంపలేదు. అధికార వైసీపీ బీజేపీతో సఖ్యతగా మెలుగుతుంది. జగన్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ వెళ్లినప్పటికీ ఈ సమావేశానికి మాత్రం వైసీపీని దూరంగానే ఉంచాలని నిర్ణయించారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబును కూడా సమావేశానికి ఆహ్వానించలేదు. ఆయన ఇప్పటికీ జనసేన, బీజేపీతో కలసి నడిచే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మారారు. దీంతో ఏపీలోని రెండు ప్రధాన పార్టీలను స్టాలిన్ ఈ సమావేశానికి ఆహ్వానించ లేదని తెలుస్తోంది. మొత్తం మీద స్టాలిన్ రాహుల్ కోసమే విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి స్టాలిన్ ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. రాహుల్ పై అనర్హత వేటు అంశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం మేధావులకు సయితం ఆహ్వానం పంపారు. వీరిలో ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్రసింగ్ యాదవ్, ఢిల్లీ వర్శిటీ ప్రొఫెసర్లు లక్ష్మణ్ యాదవ్ ఉన్నారు.
Next Story