Wed Nov 27 2024 22:51:46 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ కలిశారు.. ఇక రచ్చేనా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. రెండు నెలల తర్వాత వీరి భేటీ జరగుతుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. రెండు నెలల తర్వాత వీరి భేటీ జరగుతుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీలూ పొత్తులతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని పవన్ కల్యాణ్, ఈసారి ఖచ్చితంగా వైసీపీని ఇంటికి పంపుతామని చంద్రబాబు ఇద్దరూ ప్రకటనలు చేశారు. జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనడం కష్టమని భావించిన ఇరు పార్టీలూ కలసి వెళ్లాలని దాదాపుగా నిర్ణయించారు.
పరామర్శకేనని అంటున్నా...
గతంలో విశాఖలో పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నప్పుడు చంద్రబాబు పవన్ వద్దకు వెళ్లి పరామర్శించారు. తాజాగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్నందుకు హైదరాబాద్ లోని పవన్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారని చెప్పారు. పరామర్శలకే పరిమితమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నా రాజకీయ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. మోదీతో పవన్ కల్యాణ్ విశాఖలో భేటీ అయిన తర్వాత ఈ సమావేశం మరింత ప్రాధాన్యత చేకూరింది. మోదీ తనతో మట్లాడిన విషయాలను చంద్రబాబుతో పవన్ పంచుకునే అవకాశాలున్నాయంటున్నారు.
యాత్రలపై చర్చించే...
జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కుప్పం ఘటనను సాకుగా చూపి వీరిద్దరూ ఇప్పుడు భేటీ అయినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కలసి పనిచేసే అంశంపైనే ఎక్కువగా చర్చ జరిగే అవకాశముంది. మరోవైపు ప్రభుత్వంపై వత్తిడి పెంచే విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను ఏర్పాటుచేయడంపై కూడా మాట్లాడుకోనున్నారు. అన్ని పార్టీలతో కలసి వేదికను వీలయినంత త్వరగా ఏర్పాటు చేయాలన్నదే ఇద్దరి ఆకాంక్ష. పవన్ కల్యాణ్ బస్సు యాత్ర, లోకేష్ పాదయాత్ర త్వరలో ఉన్న నేపథ్యంలో ఈ భేటీలో భవిష్యత్ ప్రణాళికపై ఇరు పార్టీల అగ్రనేతలు చర్చించనున్నారు.
బీఆర్ఎస్ పైనా...
తెలుగుదేశం పార్టీ మాత్రం బీజేపీతో కలసి జనసేనతో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంది. బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తుకు అంత సుముఖంగా లేదు. దీంతో పాటు ఏపీలో బీఆర్ఎస్ పై కూడా రెండు పార్టీల నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశముంది. కాపు నేతలను కేసీఆర్ టార్గెట్ గా చేసుకుని బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో తమను దెబ్బతీయడానికే బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని టీడీపీ, జనసేనలు నమ్ముతున్నాయి. బీఆర్ఎస్ ను నిలువరించడంపైన కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశముంది. మొత్తం మీద రెండు నెలల తర్వాత జనసేన, టీడీపీ అగ్రనేతల భేటీ ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story