Fri Nov 22 2024 21:45:47 GMT+0000 (Coordinated Universal Time)
పవన్కు మహానాడు ముప్పు
మహానాడు ఈసారి రాజమండ్రిలో పెట్టడం వెనక చంద్రబాబు ప్రత్యేక వ్యూహం ఉంది. వైసీపీతో పాటు పవన్ను దెబ్బతీసే అవకాశముంది
తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం రాజమండ్రిలో నిర్వహించబోతున్నారు. ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు ఇంకా పది నెలలు మాత్రమే సమయం ఉండటంతో అనేక ముఖ్యమైన తీర్మానాలను కూడా చేయబోతున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఈ సారి రాజమండ్రిలో తీర్మానాలు ఉండబోతున్నాయంటున్నారు. ఈ మహానాడు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైనదనే చెప్పాలి. జన సమీకరణ దగ్గర నుంచి నిర్ణయాలోనూ సక్సెస్ అయ్యేలా చంద్రబాబు దగ్గరుండి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం అనేక కమిటీలను చంద్రబాబు నియమించినా పార్టీ అధినేత దగ్గరుండి అన్నీ తానై చూసుకుంటున్నారు. లోకేష్ పాదయాత్రకు విరామం ప్రకటించి ఈ మహానాడులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు. పాదయాత్ర వంద రోజులకు పైగానే పూర్తి చేసుకున్న లోకేష్ తొలిసారి మహానాడులో ప్రసంగించబోతున్నారు.
స్పెషల్ అట్రాక్షన్....
లోకేష్ ప్రసంగం కోసం కూడా ప్రత్యేకంగా స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు. యువత, నిరుద్యోగులను ఆకట్టుకునే విధంగా లోకేష్ స్పీచ్ ఉండబోతుందన్న వార్తలు అందుతున్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే మహానాడును రాజమండ్రిలో పెట్టడానికి కారణమేంటి? గత మహానాడును ఒంగోలులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఈ మహానాడును రాజమండ్రిలోనే ఎందుకు జరుపుతుంది? ఇందుకు ప్రత్యేక కారణాలేమనా ఉన్నాయా? అన్నది అందరిలోనూ చర్చ జరుగుతుంది. నిజానికి విశాఖలో గాని, విజయవాడలోగాని, తిరుపతిలో గాని ఈ మహానాడును పెట్టాల్సి ఉంది. మూడు ప్రాంతాలు కాకుండా చంద్రబాబు రాజమండ్రినే మహానాడు వేదికను ఎందుకు ఎంపిక చేశారు. పైగా ఈ మహానాడుకు మరో ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో గోదావరి తీరాన్ని ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.
దాదాపు యాభై నియోజకవర్గాల్లో...
వచ్చే ఎన్నికల్లో జనసేన పొత్తు దాదాపుగా ఖరారయింది. జనసేనకు తూర్పు గోదావరి జిల్లాలోనే బలం ఎక్కువగా ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను నియోజకవర్గాలున్నాయి. దీంతో పాటు ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ ఈ మహానాడు ఎఫెక్ట్ పడుతుంది. దీంతో దాదాపు యాభై నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయవచ్చు. దీంతో పాటు జనసేనతో పాటు ఇతర పార్టీలకు వెళ్లే వారిని కొంత అదుపు చేసే వీలు కలుగుతుంది. అంతేకాదు ఓటు బ్యాంకును కూడా పెంచుకునే వీలుంటుంది. అంతేకాకుండా ఈ మహానాడు క్యాడర్ లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ఈసారి రాయలసీమలో కొంత పార్టీ దెబ్బతిన్నా ఉభయ గోదావరి జిల్లాల్లో బలాన్ని మరింత పెంచుకునేందుకు ఈ మహానాడు ఉపయోగపడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఎక్కువ స్థానాలను....
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కూడా కొంత అదుపు చేసే అవకాశం మహానాడు ద్వారా దక్కే అవకాశముంది. జనసేన ఎక్కువగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే పొత్తులో భాగంగా ఎక్కువ స్థానాలు అడిగే అవకాశాలున్నాయి. జనసేనకు ఇరవై నుంచి ముప్ఫయి స్థానాలు ఇచ్చే అవకాశముందంటున్నారు. అందులో సింహభాగం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంటాయి. కాకినాడ, నరసాపురం ఎంపీ స్థానాలు ఇప్పటికే జనసేకునేే ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గోదావరి తీరాన తన బలాన్ని ప్రదర్శించు కోవడానికి చంద్రబాబు మహానాడును ఒక అవకాశంగా మలుచుకుంటారన్నది వాస్తవం. మరో ముఖ్యమైన కారణం తూర్పు గోదావరి జిల్లాలో ఎవరికి అధిక స్థానాలు వస్తే వారికే అధికారం దక్కే ఛాన్స్ ఉంది. ఛాన్స్ మాత్రమే కాదు.. సెంటిమెంట్ అని కూడా చెప్పాలి. అందుకే చంద్రబాబు రాజమండ్రిని మహానాడును ఎంపిక చేసి పవన్ కు పరోక్షంగా సిగ్నల్స్ ఇవ్వనున్నారన్నది వాస్తవం. గత మహానాడు ఒంగోలులో జరిగిన దానికంటే ఎక్కువ సంఖ్యలో రాజమండ్రి బహిరంగ సభకు హాజరు అయ్యేలా చూడాలని చంద్రబాబు ఇప్పటికే నేతలను ఆదేశించారు. మరి మహానాడు విజయవంతానికి తమ్ముళ్లు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story