Fri Nov 22 2024 13:43:23 GMT+0000 (Coordinated Universal Time)
రాధా వైపు మొగ్గు.. బొండాకు నో ఛాన్స్
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ వంగవీటి రాధాకు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలిసింది
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ వంగవీటి రాధాకు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలిసింది. బొండా ఉమామహేశ్వరరావును పక్కన పెట్టే ఛాన్సుంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈసారి విజయవాడ సెంట్రల్ టిక్కెట్ వంగవీటి రాధాకు ఇవ్వాలని తేలింది. దీనికి చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. జనసేన పొత్తు ఉంటే ఆ సీటును కోరే అవకాశముందని భావించి వంగవీటి రాధా పేరును ముందుగానే డిసైడ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
మరేదైనా...?
బొండా ఉమను మరొక నియోజకవర్గానికి పంపుతారా? లేక అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇస్తారా? మరీ లేదంటే ఎక్కడైనా పార్లమెంటు టిక్కెట్ ఇచ్చే అవకాశముందా? అన్నది పరిశీలిస్తున్నారు. రాబిన్ శర్మ టీం ఇప్పటికే అనేక సార్లు సర్వేలు నిర్వహించింది. గత ఎన్నికల్లో వైసీీపీ అభ్యర్థి మల్లాది విష్ణుమీద అతి స్వల్ప తేడాతోనే బొండా ఉమామహేశ్వరరావు ఓటమి పాలయ్యారు. కేవలం ఏడు వందల తేడాతోనే ఓటమి పాలయ్యారు. బొండ ఉమామహేశ్వరరావు టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
తక్కువ ఓట్లతోనే...
ఈ నేపథ్యంలో ఆయనను తప్పిస్తారా? అన్న చర్చ కూడా లేకపోలేదు. బొండా ఉమ తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఆయన 2019లో పార్టీ గెలుపొందకపోయినా పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. అధికార వైసీపీపై విమర్శలు చేయడానికి ముందుంటారు. క్రియాశీలకంగా ఉన్న నేతను తప్పిస్తే రాజకీయ ఇబ్బందులు ఎదురవుతాయన్న భావన కూడా లేకపోలేదు. మరోవైపు వంగవీటి రాధా పార్టీ కార్యక్రమాల్లో గత నాలుగేళ్ల నుంచి పెద్దగా పాల్గొన్నది లేదు. ఆయన అప్పుడప్పుడు ప్రజల్లో కనిపించడం తప్ప పెద్దగా బయటకు వచ్చిందీ లేదు. అయితే వంగవీటి రాధాకు కాపు సామాజికవర్గం అండదండలు పుష్కలంగా ఉండటం, రంగా అభిమానులు ఆయనను మరోసారి ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటుండటంతో చంద్రబాబు సెంట్రల్ సీటును ఇస్తారన్న టాక్ నడుస్తుంది.
మరికొన్ని సీట్లలో...
అదే సమయంలో వంగవీటి రాధాకు సెంట్రల్ సీటు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తామన్న రాబిన్ శర్మ నివేదిక కూడా ఇందుకు కారణమవుతుందంటున్నారు. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని జనసేనకు ఇవ్వాలని భావిస్తున్నారు. అక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అక్కడ ఉన్న గద్దె రామ్మోహన్ ను గన్నవరం నియోజకవర్గానికి పంపాలని చంద్రబాబు నిర్ణయించారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా కొత్త వారిని ఎంపిక చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ఇక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి సమీకరణలు మారొచ్చు. ఆలోచనలు మారే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈసారి బెజవాడలో ఉన్న సీట్ల విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరించే అవకాశాలున్నాయన్నది పార్టీ నుంచి అందుతున్న సమాచారం.
Next Story