Mon Dec 23 2024 09:33:58 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ సెల్ఫ్ గోల్ .... బాబు అంచనా అదేనట
టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్యోగ సంఘాల సమ్మెపై ఒకింత దృష్టిపెట్టారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాల సమ్మెకు మద్దతు ప్రకటించారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఉద్యోగ సంఘాల సమ్మెపై ఒకింత దృష్టిపెట్టారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాల సమ్మెకు మద్దతు ప్రకటించారు. టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల డిమాండ్లను తాము సానుకూలతో పరిశీలించానని చంద్రబాబు చెబుతున్నారు. అయితే నేరుగా వారి ఆందోళనలో పాల్గొనాలంటే వారి నుంచి ఆహ్వానం అందాల్సి ఉంటుంది. కానీ ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలను దూరం పెట్టి తాము సొంతంగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.
సమ్మె జరిగినా... జరగకపోయినా?
అయితే సమ్మె జరుగుతుందా? లేదా? అన్న అంశాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. సమ్మె కాలంలో మద్దతుగా ఉండాలని టీడీపీ శ్రేణులను ఆదేశించే అవకాశం ఉంది. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళుతున్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళితే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే అవకాశముందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. దాదాపు పదిహేను లక్షల మంది ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారతారన్నది చంద్రబాబు భావన.
ఆ ఓట్లన్నీ....
గత ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్లతోనే తాము ఓడిపోయామని, ఉద్యోగుల, పింఛనుదారులు తమకు ఖచ్చితంగా ఈసారి అండగా నిలుస్తారని సీనియర్ నేతలతో భేటీ సందర్భంగా చంద్రబాబు అన్నట్లు తెలిసింది. సమ్మె జరిగినా, జరగకపోయినా ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారతారన్నది చంద్రబాబు విశ్వాసం. ఉద్యోగుల డిమాండ్లను ఈ ప్రభుత్వం అంగీకరించదని, సమ్మె జరిగితే ఒకరకంగా, జరగకపోయినా మరొకరకంగా టీడీపీకి లాభమేనని చెబుతున్నారు.
ఏం జరుగుతుందో చూద్దాం....
ఒకరకంగా ముఖ్యమంత్రి జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని చంద్రబాబు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. జగన్ తప్పులను ఎత్తి చూపకుండా వదిలేస్తే మరింత లాభం చేకూరుతుందని, అందుకనే ఉద్యోగుల సమ్మె విషయంలో ఆచితూచి వ్యవహరించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. అందుకే ఉద్యోగుల విషయంలో ఎవరూ ఇప్పుడు ఏమీ మాట్లాడవద్దని కూడా చంద్రబాబు నేతలను ఆదేశించినట్లు తెలిసింది.
Next Story