Sun Dec 01 2024 07:24:01 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో బాబు.. వారితో వరస మీటింగ్లు
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న జీ 20 సన్నాహక సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఈరోజు కూడా ఢిల్లీలోనే ఉన్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న జీ 20 సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు ఈరోజు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అయితే ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను కలిసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. కానీ చంద్రబాబు కూడా వారి అపాయింట్మెంట్ కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అపాయింట్ మెంట్ కోరినా వారు ఇవ్వలేదా? ఈయన అడగలేదా? అన్నది తెలియకున్నా ప్రస్తుతం చంద్రబాబు మాత్రం మీడియా మిత్రులతో బిజీగా ఉన్నారని తెలిసింది.
జాతీయ మీడియా ప్రతినిధులతో...
నిన్న రాత్రి జీ 20 సన్నాహక సమావేశంలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు పలువురు జాతీయ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారని తెలిసింది. వారితో ఆయన డిన్నర్ చేస్తూ పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని చంద్రబాబు జాతీయ మీడియా ప్రతినిధులతో అన్నారని తెలిసింది. లోకేష్ పాదయాత్ర గురించి కూడా ఆయన వారి ఎదుట ప్రస్తావించారట. ఎంపిక చేసుకున్న కొన్ని మీడియా ప్రతినిధులతోనే ఆయన డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని తెలిసింది.
గెలుపు తనదేనని....
ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు తన ఇంటికి తెలుగు మీడియా ప్రతినిధులను లంచ్ కు ఆహ్వానించారు. తెలుగు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తున్నారు. కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలో తన పర్యటనకు లభించిన ఆదరణతో పాటు రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారని ఆయన మీడియా మిత్రులతో అన్నట్లు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి బాగా జనాల్లో ఉందని, ఈసారి తమ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. ఢిల్లీలో పెద్దలను ఎవరినీ కలవకుండానే సాయంత్రం ఆయన తిరిగి ఢిల్లీ నుంచి బయలుదేరి వస్తారని సమాచారం. మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ ఈయన కోరలేదా? వారు ఇవ్వలేదా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
Next Story