Fri Dec 27 2024 02:39:15 GMT+0000 (Coordinated Universal Time)
బాబు కేబినెట్ ఇదేనట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన జోరుగా చేస్తున్నారు. ఆయన పర్యటనలకు జనం నుంచి మంచి స్పందన కనిపిస్తుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన జోరుగా చేస్తున్నారు. ఆయన పర్యటనలకు జనం నుంచి మంచి స్పందన కనిపిస్తుంది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో ఆయన జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒక్కొక్క జిల్లాలో మూడు నియోజకవర్గాలను చుట్టేసి మరీ వస్తున్నారు. కార్యకర్తలు, పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. వచ్చే ఎన్నికలకు వారిని కార్యోన్ముఖులను చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా కొందరికి హామీ ఇస్తున్నారని తెలిసింది. అయితే ఇందుకు గెలిచి రావాలని వారిని మరింత ఉత్సాహ పరుస్తున్నారు. ఇది కొందరికి వెటకారంగా అనిపించవచ్చు. కానీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకంతోనే చంద్రబాబు ఎంపిక చేసుకున్న కొందరికి మంత్రి పదవి హామీ ఇస్తున్నట్లు పార్టీలో ఇన్నర్ వర్గాల టాక్.
వీరిందరికీ టిక్కెట్లు...
ఇక 2019 ఎన్నికల్లో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు సిట్టింగ్ లందరికీ టిక్కెట్ లను చంద్రబాబు ముందుగానే కన్ఫర్మ్ చేశారు. వారు తిరిగి ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగనున్నారని ముందుగానే తెలిసిపోయింది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వారిలో అధికశాతం మందికి మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు ముందుగానే డిసైడ్ అయ్యారు. అయితే అందులో కొందరికి సామాజికవర్గాల పరంగా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఇప్పుడు తన వెంట ఉన్న వారందరికీ మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది.
పదిహేను మందిలో...
23 మంది గెలిస్తే అందులో నలుగురు పార్టీని వీడారు. గంటా శ్రీనివాసరావు ఊగిసలాటలో ఉన్నారు. దీంతో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలను ఇందులో నుంచి మినహాయిస్తే పదిహేను మందిలో అత్యధిక శాతం మందికి మంత్రి పదవులు దక్కుతాయని పార్టీలోనే ప్రచారం జరుగుతుంది. అందులో ప్రధానంగా ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, రేపల్లె నియోజకవర్గం అనగాని సత్యప్రసాద్, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే మంతెన రామరాజు వంటి వారికి టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారంటీ అన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు నుంచి కూడా అదే భరోసా నేతలకు లభించింది.
ఆ సామాజికవర్గంలోనే...
ఇక కమ్మ సామాజికవర్గం నేతల విషయంలోనే కొంత ఆలోచించాల్సి వస్తుంది. గద్దె రామ్మోహన్, పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణ బాబు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావులు వంటి వారికి కొందరికే మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లభించవచ్చు. వీరిలో అందరూ సీనియర్లే. అందరూ రెండు నుంచి మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు. ప్రతి ఒక్కరూ అధికారంలోకి రాగానే మంత్రి పదవిని ఆశిస్తారు. వీరందరికీ నామినేట్ పదవులు ఇవ్వాలన్నా కుదిరేపని కాదు. అదే అసలు సమస్య. వారికి వేరే విధంగా ప్రయోజనాలు చేకూర్చాల్సి ఉంటుంది. మరోవైపు కొందరు సీనియర్లకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. వారిలో కొందరు ఎమ్మెల్సీలు కూడా ఉంటారట.
సాధ్యం కాకుంటే...?
మంత్రివర్గంలో తన సామాజికవర్గానికి చెందిన అంతమందికి చోటు ఇవ్వరు. ఇచ్చే అవకాశం లేదన్నది పార్టీ వర్గాల్లో చర్చ. అసలు గెలిచి అధికారంలోకి వస్తేనే కదా? ఈ సమస్య అనే వారు లేకపోలేదు. గెలిస్తే మాత్రం చంద్రబాబుకు ఈ సామాజికవర్గం నేతలను సంతృప్తిపర్చడం కత్తిమీద సామే అవుతుందన్నది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అందుకే అంతర్గత సమావేశాల్లో చంద్రబాబు మంత్రిపదవులు చెప్పి నేతల్లో ఆశలు కల్పిస్తున్నారట. అప్పుడైనా వారు యాక్టివ్ అవుతారన్నది ఆయన ఆలోచన కావచ్చు. చంద్రబాబు బుర్రే .. బుర్ర కదా? అందుకే ఇప్పుడు టీడీపీ నేతలందరూ యాక్టివ్ అయ్యేలా ఎక్కడికక్కడ మంత్రి పదవి హామీని చంద్రబాబు ఎడాపెడా ఇచ్చేస్తున్నారట. మరి ఆ నేతల ఫేట్ ఎలా ఉండనుందో? టీడీపీీ తిరిగి అధికారంలోకి వస్తుందో? లేదో? కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
Next Story