Wed Jan 08 2025 21:34:20 GMT+0000 (Coordinated Universal Time)
పాపం.. బాబు.. ఆనందం.. విలాపం
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పొత్తులతో ముందుకెళ్లడం అంత సులువు కాదు. గతంలో పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పొత్తులతో ముందుకెళ్లడం అంత సులువు కాదు. గతంలో పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. చంద్రబాబు ఇప్పుడు శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి వచ్చారు. పొత్తులను ఆయనే కోరుకుంటున్నారు. నేతల నుంచి క్యాడర్ వరకూ పొత్తులు కావాలంటుంది. ముఖ్యంగా జనసేన వంటి పార్టీలను కలుపుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రతి తెలుగు తమ్ముడి అభిమతం. పవన్ కల్యాణ్ నిన్న చెప్పినట్లు వైసీపీ వ్యతిరేక శక్తులన్నీ ఒక కూటమిగా ఏర్పడితే ఎక్కువగా నష్టపోయేది తెలుగుదేశం పార్టీయేనన్నది వాస్తవం.
సీట్లను త్యాగం ....
చంద్రబాబు ఎప్పుడైనా పొత్తులతోనే విజయం సాధిస్తారు. 2019 ఎన్నికల్లో అతి విశ్వాసంతో ఒంటరిగా వెళ్లి చావు దెబ్బ తిన్నారు. ఈసారి ఆ ప్రయోగం చేయరు. అయితే ఇప్పుడు బీజేపీని పక్కన పెడితే జనసేనతో పాటు కమ్యునిస్టు పార్టీలను చంద్రబాబు కలుపుకుని వెళ్లాలన్న యోచనలో ఉన్నారు. అదే జరిగితే పెద్ద సంఖ్యలో సీట్లను త్యాగం చేయాల్సి ఉంది. నిన్న పవన్ కల్యాణ్ ప్రసంగంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఫేస్ లో కొంత ఆనందం కన్పించినా, అదే సమయంలో కలవరం కూడా మొదలయిందంటున్నాయి పార్టీ వర్గాలు. ముఖ్యమైన, టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలను కోల్పోవాల్సి ఉంటుంది. ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండనుంది.
కనీసం 75 స్థానాలను...
పవన్ కల్యాణ్ ఈసారి ఎందులోనూ తగ్గరు. ఆయన దూకుడు చూస్తుంటే అదే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవి 175 నియోజకవర్గాలు. పవన్ కల్యాణ్ కనీసం యాభై స్థానాలను కోరుకుంటారు. కమ్యునిస్టులను కలుపుకుంటే వారికి కనీసం ఇరవై స్థానాలను కేటాయించాల్సి వస్తుంది. ఇక పొరపాటున బీజేపీ కలిసి వస్తే దానికి కూడా కనీసం ఇరవైకి పైగా అసెంబ్లీ స్థానాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దాదాపు 75 నియోజకవర్గాలు టీడీపీ త్యాగం చేయాల్సి వస్తుంది.
వారు చెప్పినట్లు వినాల్సిందే.....
గతంలో పొత్తుల విషయంలో చంద్రబాబుది పై చేయిగా ఉండేది. టీడీపీ తో పొత్తుల కోసం మిగిలిన పార్టీలు పరితపించేవి. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు. చంద్రబాబే కలసి రావాలంటూ పార్టీలను కోరుతున్నారు. జగన్ ను దించకపోతే పార్టీకి ఇక భవిష్యత్ ఉండదు. అందుకే చంద్రబాబు ఈసారి మిత్రపక్షాల సీట్ల కోరికలను మన్నించాల్సి ఉంటుంది. ఎవరిని నొప్పించినా తనకే ఇబ్బంది. అందుకే ఈసారి ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమికి చంద్రబాబు నేతృత్వం వహించినా డామినేషన్ మాత్రం మిత్రపక్షాలదేనంటున్నారు. త్యాగాలకు సిద్ధం కావాలని తమ్ముళ్లకు చంద్రబాబు త్వరలో పిలుపునిచ్చినా ఇవ్వవచ్చు.
Next Story