Tue Dec 24 2024 02:50:10 GMT+0000 (Coordinated Universal Time)
ఆ యువనేతకు హ్యాండ్ ఇస్తారా?
టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులకు సిద్ధమవుతున్నారు. కర్నూలు టిక్కెట్ టీజీ భరత్‌కు దక్కుతుందా లేదా అన్న చర్చ ఉంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొత్తులకు సిద్ధమవుతున్నారు. జనసేనతో ఆయన పొత్తు చర్చల తర్వాత ఖరారవుతుంది. కానీ వామపక్షాలు మాత్రం ఆయన వెంటే నడవనున్నాయి. అది కన్ఫర్మ్. ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాలుగా లెఫ్ట్ పార్టీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నాయి. జనసేన విషయం పక్కన పెడితే వామపక్షాలు మాత్రం పసుపు జెండాతో కలసి నడిచేందుకు దాదాపు సిద్ధమయ్యారనే చెప్పాలి. పోలింగ్ బూత్‌ల వద్ద ధైర్యంగా అధికార పార్టీ కార్యకర్తలను ఎదుర్కొనాలంటే వామపక్షాల సహకారం కూడా అవసరం. అందుకే వారికి కొన్ని సీట్లను చంద్రబాబు ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఆ నియోజకవర్గాలేంటి? అన్న దానిపై ప్రస్తుతం టీడీపీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది.
గత నాలుగేళ్లుగా...
ప్రధానంగా ఒక యువనేతకు మాత్రం గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పటికైనా శాసనసభలో అడుగుపెట్టాలన్న తన కోరిక నెరవేరాలని కర్నూలు నగరానికి టీజీ భరత్ ఆకాంక్షిస్తున్నారు. తండ్రి బీజేపీలోకి వెళ్లినా టీజీ భరత్ మాత్రం తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో గత నాలుగేళ్లుగా చురుగ్గా పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ పై కేవలం ఐదు వేల ఓట్ల తేడాతోనే ఓటమి చెందారు. తండ్రి టీజీ వెంకటేష్‌కు కూడా భరత్‌ను టీడీపీ నుంచే శాసనసభకు పంపాలని గట్టిగా భావిస్తున్నారు. బీజేపీలో ఉన్నా వెనకుండి ఆయన కుమారుడికి డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఆర్థికంగా బలమైన నేత కావడంతో చంద్రబాబు కూడా వారిని కాదని మరెవ్వరికీ సీటు ఇచ్చే అవకాశం లేదు.
సీపీఎం నుంచి...
అయితే పొత్తు అది లేకుంటే మాత్రమే. వామపక్షాలతో పొత్తు ఉంటే టీజీ భరత్‌కు టిక్కెట్ దక్కడం కష్టమేనంటున్నారు. ఎందుకంటే అక్కడ సీపీఎం నుంచి టిక్కెట్ కోసం పోటీ అధికంగా ఉంటుంది. సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే ఎం. అబ్దుల్ గఫూర్ సిద్ధంగా ఉన్నారు. ఆయన వైసీపీని వ్యతిరేకించే బలమైన గొంతుకగా మారారు. సీపీఎం కూడా గఫూర్ అభ్యర్థిత్వాన్ని కాదనలేదు. అబ్దుల్ గఫూర్ గతంలో రెండు సార్లు కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994, 2004 లో సీపీఎం అభ్యర్థిగా కర్నూల్ టౌన్ నుంచి విజయం సాధించారు. దీంతో ఈసారి కూడా అబ్దుల్ గఫూర్ టిక్కెట్ కోసం పోటీ పడే అవకాశముంది. ఇటీవలే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పదవికి పోటీ పడి భంగపడిన గఫూర్‌ను బుజ్జగించేటందుకైనా ఆ పార్టీ గఫూర్ పేరును సిఫార్సు చేస్తుంది. కొద్దో గొప్పో బలముండటం, గతంలో గెలిచిన నేత కావడంతో చంద్రబాబు కూడా కాదనలేని పరిస్థితి.
సామాజికవర్గం చూస్తే ....
దానికితోడు రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో గత ఎన్నికల్లో కేవలం మూడు అసెంబ్లీ స్థానాలను మాత్రమే టీడీపీ గెలుచుకోగలిగింది. అందునా కర్నూలు జల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారైనా రాయలసీమ జిల్లాల్లో సీట్లు దక్కకపోతే అధికారం కూడా దొరకడం కష్టమే అవుతుంది. అందుకే కొన్ని కీలకమైన స్థానాల విషయంలో చంద్రబాబు రాజీ పడక తప్పదంటారు. అందులో భాగంగా కర్నూలు సిటీ స్థానాన్ని సీపీఎంకు ఇచ్చినా ఇచ్చేయొచ్చు. అదే జరిగితే టీజీ భరత్ ఆశలు ఈసారి కూడా నెరవేరనట్లే. అయితే వైశ్య సామాజికవర్గం కోటాలో తమకు సీటు ఖచ్చితంగా వస్తుందని టీజీ భరత్ నమ్ముతున్నారు. సిద్ధా రాఘవరావు వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఆ స్థాయి వైశ్య నేత టీడీపీలో లేకపోవడం భరత్‌కు సానుకూలించే అంశమని కొందరంటున్నారు. మొత్తం మీద చివరి నిమిషంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మాత్రం టీజీ ఫ్యామిలీని వీడటం లేదు.
Next Story