Thu Jan 16 2025 07:59:46 GMT+0000 (Coordinated Universal Time)
ఆ వ్యవస్థకు పోటీగా మరో వ్యవస్థ...?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అన్ని రకాల దారులు వెతుకుతున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అన్ని రకాల దారులు వెతుకుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో వాలంటీర్ల వ్యవస్థకు పోటీగా తమ కార్యకర్తలను నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం కసరత్తులు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపి ఈ వ్యవస్థ ఏర్పాటుపై నేతలతో చర్చించనున్నారు.
వాలంటీర్లతో.....
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అఫిషియల్ గానే వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీరు ప్రతి యాభై కుటుంబాలకు ఒకరు ఉంటారు. వీరే పింఛన్లతో పాటు మిగిలిన ప్రభుత్వ పథకాలను ఆ కుటుంబాలకు అందజేస్తారు. వీరు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముంది. వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పటికే అనేకసార్లు చంద్రబాబు ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికల్లోనూ వీరి వల్ల ఇబ్బంది ఎదురవుతుందని భావిస్తున్నారు.
ప్రతి యాభై ఇళ్లకు...
దీంతో వాలంటీర్ల వ్యవస్థకు ధీటుగా కార్యకర్తలను ప్రతి యాభై ఇళ్లకు ఒక ఒకరిని నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. వీరి నియామకం వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. వీరికి పార్టీ నుంచి కొంత గౌరవ వేతనం కూడా చెల్లించే అవకాశముంది. వీరు తమకు కేటాయించిన యాభై కుటుంబాల వద్దకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించడం, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్దిని చెప్పడమే వీరి ప్రధాన విధి.
వచ్చే ఏడాది ప్రారంభంలో....
తెలుగుదేశం పార్టీకి 175 నియోజకవర్గాల్లో బలమైన కార్యకర్తలున్నారు. వారిలో నుంచి ఈ విధులను నిర్వహించడానికి ఎంపిక చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ నియామకం జరగాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యం. త్వరలోనే అన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో సమావేశమయి ఈ వ్యవస్థ ఏర్పాటు పై చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిసింది. వీరినే పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా కూడా వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
Next Story