Mon Dec 23 2024 23:04:05 GMT+0000 (Coordinated Universal Time)
బాబుకు నిద్రపట్టనివ్వని అంశం అదేనట
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా సిద్ధమని చెబుతున్నారు. ఆ మేరకు క్యాడర్ లో జోష్ నింపుతున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా సిద్ధమని చెబుతున్నారు. ఆ మేరకు క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. ఎలక్షనీరింగ్ ను పక్కన పెడితే ఇప్పుడు హామీలు చంద్రబాబుకు పెద్ద ఇబ్బందిగా మారనుంది. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్న హామీ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు తాను అధికారంలోకి వస్తే ఏం చేయదలచుకున్నారన్నది చెప్పాల్సి ఉంటుంది.
ఆ పథకాన్ని ఇక్కడ.....
ఇప్పటికే చంద్రబాబు మ్యానిఫేస్టోపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెస్తామని చెప్పనున్నారు. తెలంగాణలో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల నగదు ఇస్తున్నారు. అయితే ఇంత కాకపోయినా ఐదు లక్షల వరకూ ఒక్కొక్క దళిత కుటుంబానికి ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది.
దళితులు ఎక్కువగా...
దళితులు ఎక్కువగా జగన్ పక్షాన ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు జగన్ కు అండగా ఉంది. ఆ ఓట్లలో చీలిక తేవాలంటే దళితులతో పాటు గిరిజనులకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేయాలన్న యోచనలో ఉన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో ఎన్ని గిరిజన కుటుంబాలున్నాయన్న దానిపై లెక్కలు తీస్తున్నారని చెబుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్న అంచనాలో చంద్రబాబు ఉన్నారు.
జగన్ పథకాలను....
వీటన్నింటితో పాటు జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దాదాపు 3.5 లక్షల కుటుంబాలకు వివిధ పథకాల రూపంలో నగదును పంపిణీ చేస్తున్నారు. ఈ పథకాలన్నింటినీ తాను కూడా అమలు చేస్తానన్న ప్రామిస్ ను చంద్రబాబు చేయాల్సి ఉంటుంది. లేకుంటే 3.5 లక్షల కుటుంబాలు తనకు దూరమయ్యే అవకాశముంది. అలాగే ఆర్టీసీని తిరిగి కార్పొరేషన్ ను చేయనని కూడా చంద్రబాబు గట్టి హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఒకవైపు చంద్రబాబు సమీక్షలు చేస్తూనే మరో వైపు మ్యానిఫేస్టోపై దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story