Wed Nov 20 2024 04:26:06 GMT+0000 (Coordinated Universal Time)
సభకు వెళ్లను.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా
తాను అసెంబ్లీకి వెళ్లనని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు
నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంత అవమానాన్ని భరించలేదు. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని విధాలుగా అవమానించడం, పార్టీ నాయకులను వేధించడం, జైల్లో పెట్టడం, కార్యకర్తలను ఆర్థికంగా, రాజకీయంగా వేధించారు. అన్నింటా భరించాం. వ్యక్తిగతంగా దూషించారు. బూతులు తిట్టారు. అవి కూడా భరించాం. కుప్పం ఎన్నిక తర్వాత ముఖ్యమంత్రి వ్యంగంగా మాట్లాడారు. అన్నీ భరించాం. ఈరోజు అసెంబ్లీకి వెళితే నా భార్యను కూడా సభలోకి లాగే పరిస్థితికి వచ్చారు.
ఎనిమిది సార్లు...
ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. 38 ఏళ్లుగా సభకు వస్తున్నాను. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నాం. ఓడిపోయాం. గెలిచాం. ఓడిపోయినప్పుడు కుంగిపోలేదు. గెలిచినప్పుడు రెచ్చిపోలేదు. నేను ఎప్పుడూ అవహేళనగా మాట్లాడలేదు. ఎంతో మంది నాయకులతో పనిచేశాను. జాతీయ రాజకీయాల్లో కూడా ఉద్దండులైన వారితో కలసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. ప్రజల కోసం చేసేది రాజకీయం అని నేను నమ్మాను.
మహామహులతో...
హైదరాబాద్ ను అభివృద్ధి చేశాను. ఇక్కడ కూడా అభివృద్ధి చేసి గర్వంగా ఫీలయ్యాను. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాను. ఎప్పుడూ నా భార్య రాజకీయాల్లోకి రాలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆమె రాజకీయాలను పట్టించుకోలేదు. టీడీపీ ఓటమి పాలయినా తనను ప్రోత్సహించిందే తప్ప ఏరోజూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఈ కౌరవ సభ, గౌరవం లేని సభలో ఉండటం వృధా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ధర్మానికి, అధర్మానికి పోరాటం. ప్రజాక్షేత్రంలోనే నిర్ణయించుకుంటాను. నాకు సీఎంగా ఉండాలన్న కోరిక లేదు. గౌరవంగా బతికే వ్యక్తులను బజారు కీడ్చే ఈ రాజకీయాలు వేధిస్తున్నాయి. అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు.
- Tags
- chandra babu
- tdp
Next Story