Sat Nov 30 2024 12:31:36 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు స్ట్రాటజీ మార్చారా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్ట్రాటజీ మార్చినట్లే కన్పిస్తుంది. బీజేపీకి దూరం జరగాలని నిర్ణయించుకున్నట్లుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్ట్రాటజీ మార్చినట్లే కన్పిస్తుంది. బీజేపీకి దూరం జరగాలని నిర్ణయించుకున్నట్లు ఆయన అడుగులు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తున్నా అటు నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు. పైగా జగన్ వైపు బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు ఆయనకు సమాచారం అందింది. దక్షిణాది రాష్ట్రాలలో పోస్ట్ పోల్ అలయన్స్ కు బీజేపీ వైసీపీ వైపు చూస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
బీజేపీ ప్రభావం....
రాష్ట్రంలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. పైగా మోదీపై వ్యతిరేకత కొంత తనకు సానుకూలంగా మారవచ్చన్న అంచనాల్లో చంద్రబాబు ఉన్నారు. జనసేన పార్టీ బీజేపీతో విడిపోయి తనతో చేరవచ్చన్న అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు. ఎన్నికల్లో నేరుగా జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. కమ్యునిస్టులు, జనసేనను కలుపుకుని తాను ఎన్నికలకు వెళితే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశముందని చంద్రబాబు ఆశిస్తున్నారు.
పెద్దగా ఇబ్బందులు ఉండవని....
పార్లమెంటు ఎన్నికలతో కలిపి ఏపీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో తన పార్టీకి బీజేపీ పెద్దగా ఇబ్బందులు కలిగించదన్న ఆలోచన చంద్రబాబుకు ఉంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలని దూరం పెట్టి మిగిలిన కలసి వచ్చే పార్టీలతో ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు సమాయత్త మవుతున్నారు. ఇందుకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన ఘటనే ఉదాహరణ. ఇప్పటి వరకూ గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ అడ్డుకోలేదు.
గవర్నర్ ప్రసంగాన్ని.....
నిన్న జరిగిన గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే గవర్నర్ పై టీడీపీ యుద్ధం ప్రకటించినట్లు అర్థమవుతుంది. గవర్నర్ ను అవమానపరిస్తే అది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి జరిగినట్లే. చంద్రబాబు ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనక బీజేపీతో కయ్యానికి సిద్దమవుతున్నట్లే కన్పిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు బీజేపీతో సై అనడానికి సిద్ధమయ్యారనే చెప్పాలి.
Next Story