Mon Dec 23 2024 18:21:41 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు బందీ...వీరి చేతిలోనేనా?
పార్టీని బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు.
పార్టీని బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. అయితే ఆయనను కొంత తప్పు దోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరి వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు బందీ అయ్యారన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా పార్టీలో సీనియర్ నేతల నుంచి యువ నేతల వరకూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ముఖ్యంగా తొండెపు దశరధ జనార్థన్ పై సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. చంద్రబాబు వద్దకు వాస్తవ సమాచారం వెళ్ల కుండా టీడీ జనార్థన్ అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బయటకు పెద్దగా కన్పించరు. మీడియా ముందుకు అస్సలు రారు. చంద్రబాబుకు అంతా తానే వ్యవహరిస్తుంది ఈయనేనన్న టాక్ పార్టీ లో ఎప్పటి నుంచో నడుస్తుంది.
మాజీ మంత్రి బంధువు....
నిజానికి తొండెపు దశరధ జనార్థన్ 2004 ముందు వరకూ పార్టీలో అంత క్రియాశీలకంగా లేరు. మాజీ మంత్రి నెట్టం రఘురాం బంధువుగా ఆయన టీడీపీలోకి వచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ పోటీ చేయలేదు. చంద్రబాబు 1999లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీ జనార్థన్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆప్కాబ్ ఛైర్మన్ గా నియమించారు. ఆప్కాబ్ ఛైర్మన్ గానే ఆయన పార్టీలో అందరికీ సుపరిచితమయ్యారు. అనంతరం పార్టీలో క్రియాశీలకంగా మారారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి చంద్రబాబుకు దగ్గరయ్యారు. నమ్మకమైన వ్యక్తిగా మారారు.
ఇద్దరికీ దగ్గరగా....
2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీడీ జనార్థన్ కు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఇటు చంద్రబాబును, అటు లోకేష్ ను ఏకకాలంలో తన మాటలతో మెప్పించగల నేతగా టీడీ జనార్థన్ పేరు చెబుతారు. అమరావతి రాజధాని భూముల కొనుగోళ్ల విషయంలోనూ ఈయనే ప్రధాన పాత్ర పోషించారని, లోకేష్ బినామీగా ఉన్నారన్న విమర్శలు కూడా టీడీ జనార్థన్ పై ఉన్నాయి. చంద్రబాబు ప్రసంగ పాఠాలను కూడా టీడీ జనార్థన్ దగ్గరుండి స్క్రీన్ చేసిన తర్వాతనే ఆయన వద్దకు వెళతాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
సీనియర్లకు సయితం....
పార్టీలో టీడీ జనార్థన్ కు వ్యతిరేకంగా ఏం చేసినా వారికి అక్కడ స్థానం ఉండదు. ఈ విషయాన్ని ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన దివ్యవాణి చెబుతున్నారు. సీనియర్ నేతల నుంచి జూనియర్ల వరకూ టీడీ దెబ్బ రుచి చూసిన వారే. ముందు ఆయనను ప్రసన్నం చేసుకుంటేనే తర్వాత చంద్రబాబు దర్శనం లభిస్తుందన్న టాక్ పార్టీలో బాగా వినిపిస్తుంది. కానీ టీడీ జనార్థన్ పై ఫిర్యాదు చేసే ధైర్యం ఎవరికీ లేదు. పార్టీ నుంచి బయటకు వెళ్లే వ్యక్తులు చెబుతుండటంతో చంద్రబాబు కూడా సీరియస్ గా తీసుకోవడం లేదు. కొంత ఆయనను కట్టడి చేస్తే కాని నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితులు చంద్రబాబుకు చేరవన్నది సీనియర్ నేతలు సయితం అంగీకరిస్తున్న విషయం.
Next Story