Mon Dec 23 2024 16:19:50 GMT+0000 (Coordinated Universal Time)
Devansh : 52 రోజుల తర్వాత తాతను చూసిన దేవాన్ష్ ఏం చేశాడంటే?
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి మనవడు దేవాన్ష్ ను చూసి హత్తుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి మనవడు దేవాన్ష్ ను చూసి హత్తుకున్నారు. మనవడిని చూసిన ఆయన మనసు ఉత్సాహంతో ఉరకలేసింది. గత యాభై రెండు రోజుల నుంచి చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కుటుంబ సభ్యులంతా రాజమండ్రిలో ఉన్నప్పటికీ దేవాన్ష్ ను మాత్రం ఇక్కడకు తీసుకు రాలేదు. ములాఖత్ లోనూ చంద్రబాబు వద్దకు దేవాన్ష్ ను తీసుకెళ్లలేదు.
52 రోజుల నుంచి దూరంగా...
పసి హృదయాల్లో జైలు వాతావరణం చూసి కలుషితం అవుతుందని భావించిన కుటుంబ సభ్యులు చంద్రబాబుతో ములాఖత్ కు దూరంగా ఉంచారు. దీంతో తాతయ్యకు దేవాన్ష్ దాదాపు రెండు నెలలు దూరంగా ఉండాల్సి వచ్చింది. చంద్రబాబు ఎక్కడ ఉన్నా వీకెండ్ లో హైదరాబాద్ కు వస్తుండటంతో తాతయ్యతో ఆటలు, పాటలతో సరదాగా దేవాన్ష్ ఉండేవారని అంటున్నారు. అలాంటిది గత యాభై రెండు రోజుల నుంచి జైలులో ఉండటంతో దేవాన్ష్ ను కుటుంబ సభ్యులు చంద్రబాబు వద్దకు తీసుకెళ్లకుండా దూరంగా ఉంచారు.
రాజమండ్రి జైలు వద్ద...
కొద్దిసేపటి క్రితం చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలవ్వడంతో దేవాన్ష్ ను తీసుకుని నారా బ్రాహ్మణి, బాలకృష్ణ రాజమండ్రి జైలు ప్రాంగణం వద్దకు వచ్చారు. జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన వెంటనే చంద్రబాబు తొలి చూపు మనవడు దేవాన్ష్ పైనే పడింది. మనవడిని చూసి ఆయన ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. దేవాన్ష్ కూడా తాతను పెనవేసుకుని కాసేపు అలా నిలుచుండిపోవడం అక్కడ చూసే వారికి కంట తడి పెట్టించింది. దేవాన్ష్ ను హత్తుకున్న ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Next Story