Mon Dec 23 2024 12:42:11 GMT+0000 (Coordinated Universal Time)
నోరు మెదపని చంద్రబాబు.. కారణమిదేనా?
పెగాసస్ స్పై వేర్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు మౌనంగా ఉండటం రాజకీయంగా చర్చ జరుగుతోంది.
పెగాసస్ వ్యవహారం ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసింది. పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్ వేర్ ను చంద్రబాబు నాడు కొనుగోలు చేశారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగి చివరకు హౌస్ కమిటీకి విచారణను అప్పగించారు. అయితే పెగాసస్ స్పై వేర్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు మౌనంగా ఉండటం రాజకీయంగా చర్చ జరుగుతోంది.
చిన్న విషయాలకు కూడా....
చిన్న విషయాలకు కూడా చంద్రబాబు స్పందిస్తారు. అలాంటిది తన హయాంలో జరిగినట్లు ఆరోపణలు వినపడుతున్న పెగాసస్ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్న వినిపిస్తుంది. పెగాసస్ వ్యవహారంపై నారా లోకేష్ తో పాటు పయ్యావుల కేశవ్, అయ్యన్నపాత్రుడు వంటి వారు స్పందించారు. తాము ఎలాంటి స్సైవేర్ ను కొనుగోలు చేయలేదని, వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి విచారణ చేసుకోవచ్చని సవాల్ విసిరారు.
వైసీపీ ఆరోపణలు తీవ్రతరం....
కానీ ప్రధానంగా చంద్రబాబు దీనిపై ఇంతవరకూ స్పందించలేదు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. ప్రభుత్వం తరుపున కాకుండా పార్టీ పరంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్యల విషయంలోనూ స్పందించే చంద్రబాబు పెగాసస్ వ్యవహారంపై ఎందుకు మాట్లాడటం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి చంద్రబాబు నుంచి పెగాసస్ వ్యవహారంపై వివరణ వస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story