Sun Dec 22 2024 22:12:03 GMT+0000 (Coordinated Universal Time)
కడపలో టీడీపీ డిజాస్టర్ హిస్టరీ... ఈసారి రిపీట్ కాదట
ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీకి పెద్దగా బలం లేదు. అయితే ముగ్గురు యువనేతలు కొంత ఆశలు కల్పిస్తున్నారు
కడప జిల్లాలో టీడీపీకి ఆశాకిరణాలు ఎవరైనా కనిపిస్తారా ? అన్న ప్రశ్నకు టీడీపీ వాళ్లే ఆన్సర్ చెప్పే పరిస్థితి లేదు. గత 20 ఏళ్లలో ఆ పార్టీ కడపలో సాధించిన అతిపెద్ద విజయం ఏంటంటే ఒక్క అసెంబ్లీ సీటే.. ఓ సారి కమలాపురంలో మాత్రమే గెలిస్తే.. 2009లో ప్రొద్దుటూరులో గెలిచింది. అది కూడా జగన్ వరదరాజుల రెడ్డిపై కోపంతో చేసిన పనే ఇది అంటారు కూడా. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా రాజంపేట మాత్రమే గెలిచింది.. గత ఎన్నికల్లో అది పోయింది. సున్నా మిగిలింది. ఇక రెండు ఎంపీ సీట్లు అయిన కడప, రాజంపేటలో గెలిచి 20 ఏళ్లు దాటుతోంది. ఇది కడపలో స్థూలంగా టీడీపీ డిజాస్టర్ హిస్టరీ.
యువనేతలే...
అలాంటిది ఇప్పుడు కడప జిల్లాలో టీడీపీకి కొందరు యువనేతలు పెద్ద ఆశాకిరణాలుగా కనిపిస్తున్నారు. వీళ్లు ఇలాగే కష్టపడితే 2024లో ఒకటి, అరా సంచలనాలు ఖచ్చితంగా నమోదు అవుతాయని జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు కూడా సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన యువనేతలే. ఆ ముగ్గురు ఇప్పుడు మూడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా కూడా ఉన్నారు. ప్రొద్దుటూరు ఇన్చార్జ్ ఉక్కు ప్రవీణ్‌రెడ్డి - కడప ఇన్చార్జ్ బీటెక్ రవి - జమ్మలమడుగు ఇన్చార్జ్ దేవగుడి భూపేష్‌రెడ్డి.
ప్రొద్దుటూరులో....
ఈ ముగ్గురిలో ముందే ఇన్చార్జ్గా నియమితులు అయిన ప్రవీణ్‌రెడ్డి నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సోదరుడి కుమారుడు అయిన ప్రవీణ్‌రెడ్డి కడప ఉక్కు నినాదంతో కడప జిల్లాతో పాటు సీమ అంతా హైలెట్ అయ్యారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రవీణ్‌కు జిల్లా వ్యాప్తంగా యువతలో మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఆర్థికంగాను పర్వాలేదు. అటు వీరశివారెడ్డితో పాటు ప్రొద్దుటూరు అధికార పార్టీలో గ్రూపు విబేధాలు, ఎమ్మెల్యే రాచమల్లు రెండుసార్లు గెలవడం, వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతూ ఉండడం ప్లస్ అవుతున్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గం సపోర్ట్ పెద్దగా లేపోవడం మైనస్. ఈ గ్రూపులు హైకమాండ్ సెట్ చేస్తే 2009లో ఇక్కడ టీడీపీ చేసిన మ్యాజిక్ మరోసారి 2024లో రిపీట్ కావడం పెద్ద కష్టం కాదు.
గెలవలేకపోయినా...?
ఇక పులివెందుల కొత్త ఇన్చార్జ్గా ఎమ్మెల్సీ బీటెక్ రవి పేరును బాబు ఖరారు చేసేశారు. మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి తిరిగి పార్టీలోకి వచ్చినా కూడా రవియే 2024లో పోటీ చేస్తారని బాబు క్లారిటీ ఇవ్వడం శుభపరిణామం. వచ్చే ఎన్నికల్లో చివరి వరకు ఇక్కడ జగన్‌పై ఎవరు పోటీ చేస్తారు ? అన్న కన్ఫ్యూజ్ లేకుండా బాబు క్లారిటీ ఇచ్చేశారు. బీటెక్ రవి జగన్‌పై గెలవకపోవచ్చు.. కానీ కష్టపడితే నియోజకవర్గంలో మరి పునాదులు కూలిపోకుండా కాపాడుకోవచ్చు.. జగన్ మెజార్టీ తగ్గితే కడప ఎంపీ సీటు విషయంలో టీడీపీకి హెల్ఫ్ అవుతుంది. అయితే 2011 ఉప ఎన్నికల్లో ఇక్కడ రవి జగన్ తల్లి విజయలక్ష్మిపై పోటీ చేశారు. ఈ నియోజకవర్గంతో ఆయనకు అనుబంధమే ఉంది.
వైసీపీ అడ్డా....
ఇక ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండి తర్వాత వైసీపీ అడ్డా అయిపోయిన మరో నియోజకవర్గం జమ్మలమడుగు. ఇక్కడ ఎప్పుడూ రాజకీయాలు ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డిగా ఉండేవి. గత ఎన్నికలకు ముందు వీరు ఇద్దరు టీడీపీలో ఉన్నారు. ఆదినారాయణ కడప ఎంపీగా, రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు. తర్వాత ఆది బీజేపీలోకి వెళ్లిపోతే.. రామసుబ్బారెడ్డి వైసీపీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పోటీ ఖాయమైంది. అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీలోకి రావడం.. బాబు వెంటనే భూపేష్‌రెడ్డికి ఇన్చార్జ్ పదవి ఇవ్వడంతో పార్టీలో కొత్త జోష్ ఉంది. పైగా మాజీ మంత్రి ఆదికి నారాయణరెడ్డి స్వయానా సోదరుడు. ప్రొద్దుటూరు తర్వాత పార్టీకి ఇక్కడ మంచి అవకాశం ఉంది. ఏదేమైనా చాలా రోజుల తర్వాత కడపలో పార్టీకి ఈ స్థాయిలో బలమైన ఆశాకిరణాలు కనిపిస్తుండడం గొప్ప విషయం. పార్టీ హైకమాండ్ కూడా వీరికి మంచి పుషప్ ఇస్తే 2024లో వైసీపీకి వార్ మరీ అంత వన్‌సైడ్ అవ్వదు.
Next Story