Mon Dec 23 2024 19:41:36 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో డోన్ట్ కేర్ : బాబు ఫాలోఅప్ ఏదీ?
టీడీపీకి పార్లమెంటు సభ్యుల కొరత బాగా ఉంది. చంద్రబాబు ఆ దిశగా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు కీలకం. అసెంబ్లీ ఎన్నికలు ఎంత ముఖ్యమో అదే స్థాయిలో పార్లమెంటు ఎన్నికలు కూడా అంతే ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టాలన్నా, తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలన్నా పార్లమెంటు సభ్యులు కూడా ఎక్కువ సంఖ్యలో గెలవాల్సి ఉంటుంది. లేకుంటే ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా లెక్క చేయరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఏరకంగా చూసినా ఢిల్లీ మద్దతు అవసరం అన్నది అందరికీ తెలిసిందే. గతంలో బీజేపీని కాదనుకుని బయటకు వచ్చి తప్పు చేశామని ఇప్పటికే చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీకి ఆయన మద్దతిచ్చే విధంగా మాట్లాడటం కూడా ఇందులో భాగమే.
నాలుగేళ్లుగా...
అందుకే గతనాలుగేళ్లుగా బీజేపీని పన్నెత్తు మాట అనలేదు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికీ చంద్రబాబు పొత్తు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలో వస్తుందన్న లెక్కలు కూడా చంద్రబాబు వేసుకుని బీజేపీతో సయోధ్య కోసమే ఆయన గత నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కోరకుండానే బీజేపీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించుకోవాల్సిన దీన స్థితికి చేరుకోవాల్సి వచ్చింది. గతంలో ఢిల్లీకి వెళితే ఇతర పార్టీల నేతలు వచ్చి మరీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. కానీ ఇప్పుడా పరిస్థిితి లేదు. చంద్రబాబు ఎప్పుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న పరిస్థితి తెలియక విపక్ష నేతలు కూడా ఆయనకు దూరమయ్యారనే చెప్పాలి.
ఢిల్లీలో చంద్రబాబు వైపు...
బీజేపీ కాదు కదా.. పార్లమెంటు సభ్యులు లేకపోతే కాంగ్రెస్ వంటి విపక్షాలు కూడా చంద్రబాబును కేర్ చేయడం లేదు. అనేక ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. అయితే శాసనసభ స్థానాలపై పెట్టిన దృష్టి పార్లమెంటు స్థానాలపై చంద్రబాబు పెట్టడం లేదని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మూడు పార్లమెంటు స్థానాలు మాత్రమే దక్కాయి. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళంలో మాత్రమే టీడీపీ ఎంపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఢిల్లీ పర్యటనలు కూడా గత నాలుగేళ్ల నుంచి వేళ్ల మీద లెక్కపెట్టుకునే సంఖ్యలోనే చంద్రబాబు చేయాల్సి వచ్చింది. మరోసారి ఈ తప్పిదం జరగకూడదంటే పార్లమెంటు స్థానాల్లో గెలవడం కూడా ముఖ్యమే. కానీ టీడీపీకి పార్లమెంటు సభ్యుల కొరత బాగా ఉంది. అధికారంలో లేకపోవడంతో ఆర్థికంగా బలహీనపడిన నేతలు ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు రావడం లేదు.
ఎవరు పోటీకి?
కానీ ఆ దిశగా అధినేత చేసిన ప్రయత్నాలు కూడా శూన్యమనే చెప్పాల్సి ఉంటుంది. కోస్తా ప్రాంతంలోని రెండు మూడు నియోజకవర్గాల్లో తప్ప టీడీపీకి పార్లమెంటుకు పోటీ చేసే బలమైన అభ్యర్థులు లేరన్నది పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్న అంశం. ఇప్పటి వరకూ రాజంపేట ఎంపీ అభ్యర్థిగా గంటా నరహరిని మాత్రమే అధికారికంగా ప్రకటించారు. ఆయన పారిశ్రామికవేత్త కావడంతో వెంటనే నరహరిని అభ్యర్థిగా ప్రకటించేశారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వరకూ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయిన వారిలో అధికశాతం మంది నలుగురైదుగురు తప్ప ఎవరూ యాక్టివ్ గా కూడా లేరు. పొత్తులు కుదురుతాయని భావించ వచ్చు. అందుకే కొన్ని నియోజకవర్గాలకు మినహాయింపు ఇవ్వవచ్చు. గత ఎన్నికలలో ఎంపీలుగా పోటీ చేేసిన ఆదినారాయణరెడ్డి, బీద మస్తాన్ రావు, శిద్దారాఘవరావులు పార్టీలు వీడారు. మాగంటి రూప లాంటి వాళ్లు ఇన్ యాక్టివ్ అయ్యారు. మరి ఎన్నికల నాటికి టీడీపీకి అన్ని విధాలుగా బలమున్న నేతలు ఎవరైనా ముందుకు వస్తారా? లేదా? అన్న చర్చ జరుగుతుంది.
Next Story