Tue Jan 07 2025 19:33:30 GMT+0000 (Coordinated Universal Time)
వేగం పెంచిన బాబు.. రేస్ లో సైకిల్ ప్లేస్ ఏది?
ముందుగానే ఎన్నికలకు జగన్ వెళతారని టీడీపీ అధినేత చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అందుకే పార్టీని సిద్ధం చేస్తున్నారు
ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలీదు. ముందుగానే ఎన్నికలకు జగన్ వెళతారని టీడీపీ అధినేత చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీని సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గత కొద్దిరోజులుగా ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అంతకు ముందు బాదుడే బాదుడంటూ జనంలోకి వెళ్లారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఆ కార్యక్రమాలను కంటిన్యూ చేయాలని నిర్ణయించారు. మినీ మహానాడులు మాత్రం కొన్ని చోట్లకే పరిమితం చేశారు. జిల్లా నేతలపై ఆర్థిక భారం మోపలేక ఈ మినీ మహానాడు కాన్సెప్ట్‌లకు మంగళం పాడేసినట్లు సమాచారం.
వరస కార్యక్రమాలతో...
అయితే చంద్రబాబు కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన వస్తుండటంతో తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు మరణించడంతో కొంత గ్యాప్ ఇచ్చారు. ఈలోపు నారా లోకేష్ పాదయాత్ర కూడా ప్రారంభమయింది. ఆయన ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే నారా లోకేష్ పాదయాత్రకు అనుకున్న స్థాయిలో స్పందన లేదని భావించిన చంద్రబాబు తాను స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారన్ని బట్టి తెలుస్తోంది.
త్యాగం చేయాలంటూ...
ఈ నెల 15, 16, 17 తేదీల్లో చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఎవరికి వస్తే వారికే అధికారం దక్కుతుందన్నది సంప్రదాయంగా వస్తున్నదే. అందుకే తూర్పు గోదావరి జిల్లాపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీంతో పాటు జనసేన పొత్తు దాదాపు ఖాయం కావడంతో అక్కడ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా, టీడీపీ ఎన్ని సీట్లు పోటీ చేయాలన్న దానిపై కూడా ఈ పర్యటనతో ఒక క్లారిటీకి చంద్రబాబు వస్తారని చెబుతున్నారు. ముందుగానే త్యాగాలకు సిద్ధం కావాలని తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేతలకు చంద్రబాబు తన పర్యటనలో చెప్పనున్నారని తెలిసింది.
జోన్ ల వారీగా సమావేశాలు...
ఇక రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి పార్టీ నేతలను, క్యాడర్ ను ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో జోన్ లో 35 అసెంబ్లీ నియోజకవర్గాలుగా విభజించారు. జోన్ ల వారీగా సమావేశాలను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశాల్లో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు, ఇన్‌ఛార్జులు, కస్టర్ ఇన్‌ఛార్జులు, డివిజన్ ఇన్‌ఛార్జులు పాల్గొననున్నారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకూ వరసగా ఐదురోజులు జోన్ ల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. 21న కడప, 22న నెల్లూరు, 23న అమరావతి, 24న ఏలూరు, 25న విశాఖపట్నంలో ఈ జోన్ సమావేశాలుంటాయి. ఈ సమావేశాలకు చంద్రబాబు హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తం మీద చంద్రబాబు వేగం పెంచినట్లే కనిపిస్తుంది.
Next Story