Mon Dec 23 2024 16:26:38 GMT+0000 (Coordinated Universal Time)
యనమల ఇక సర్దుకోవాల్సిందేనా?
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుటుంబాన్ని దూరం పెట్టాలన్న యోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుటుంబాన్ని దూరం పెట్టాలన్న యోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం. యనమల కుటుంబం వల్ల పార్టీకి జరిగే లాభం కంటే నష్టం ఎక్కువన్న అంచనాకు వారు వచ్చారు. ప్రధానంగా చంద్రబాబు కంటే పార్టీ యువనేత నారా లోకేష్ యనమల కుటుంబాన్ని పూర్తిగా సైడ్ చేయాలన్న యోచనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ కుటుంబానికి సీటు దక్కడం కూడా అనుమానమే. తుని సీటుకు కూడా కొత్త వ్యక్తి కోసం అన్వేషణ ప్రారంభమయిందంటున్నారు.
ఆరుసార్లు గెలిచి....
ఇప్పటికే యనమల కుటుంబం మూడు దఫాలుగా తుని నియోజకవర్గంలో ఓటమి పాలు అవుతూ వస్తుంది. 1984 నుంచి 2004 వరకూ వరసగా ఆరుసార్లు గెలిచిన యనమల రామకృష్ణుడు 2009 లో ఓటమి పాలయ్యారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఆ తర్వాత యనమల ఎమ్మెల్సీ కాగా, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మూడు సార్లు వరసగా ఓటమి పాలయిన యనమల కుటుంబానికి మరోసారి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తుని నుంచి మాత్రం...
నారా లోకేష్ ఇప్పటికే మూడు సార్లు వరసగా ఓటమి పాలయిన వారికి టిక్కెట్లు ఇచ్చేది లేదని మహానాడులోనే బహిరంగంగా ప్రకటించారు. ఆ కోవలోకి యనమల ఫ్యామిలీ వస్తుందంటున్నారు. అయితే యనమల మాత్రం తన కుమార్తెను ఈసారి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. ఈ ప్రతిపాదనకు కూడా లోకేష్ సుముఖంగా లేరని తెలిసింది. యనమల రామకృష్ణుడి వల్లనే తూర్పు గోదావరి జిల్లాలో వర్గ విభేదాలు తీవ్రమయ్యాయని, అక్కడ నేతల మధ్య సయోధ్య లేకపోవడానికి కారణం ఆయనేనని బలంగా నమ్ముతున్నారు. ఆయనకు బీసీనేతగా కూడా ఇటీవల కాలంలో గుర్తింపు లేకుండా పోయింది. బీసీ నేతలు అనేక మంది టీడీపీలో ఉండటంతో ఆయనను ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న భావన నెలకొంది.
జిల్లాలో నేతల మధ్య...
మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. ఆయన కూడా యనమల వైఖరిపై పలుమార్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. యనమల వల్ల పార్టీకి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తీవ్రంగా నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఆయన గ్రూపులను పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే యనమల ఫ్యామిలీకి ఈసారి ఎక్కడా టిక్కెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది. యనమలకు కూడా చూచాయగా ఈ విషయాన్ని చెప్పడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారని తెలుస్తోంది. చంద్రబాబు వరకూ సీనియర్ నేతగా యనమల కు ప్రాధాన్యత ఇవ్వొచ్చు కాని చినబాబు మాత్రం ససేమిరా అంటున్నారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మొత్తం మీద యనమల ఫ్యామిలీ ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతుందన్నది మాత్రం వాస్తవం.
Next Story