Fri Nov 15 2024 18:33:28 GMT+0000 (Coordinated Universal Time)
శీను సీన్ రివర్స్... అందుకేనట
విశాఖలోని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు మూడేళ్ల నుంచి అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.
మూడేళ్ల నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీ అధినేతను కూడా పట్టించుకోలేదు. కానీ మనసు మారిందేమో. చంద్రబాబును కలిసి తాను పార్టీలోనే ఉన్నానని చెప్పారు గంటా శ్రీనివాసరావు. విశాఖలోని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు మూడేళ్ల నుంచి అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. టీడీపీలోని దాదాపు అందరు ఎమ్మెల్యేలపై కేసులు నమోదయినా గంటా మాత్రం ఇంతవరకూ పోలీస్ స్టేషన్ గడప తొక్కలేదు. వైసీపీ ప్రభుత్వంతో పెట్టుకోవడం ఎందుకులేనన్న ధోరణితో ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు...
గంటా శ్రీనివాసరావు రూటే వేరు. ఆయన స్టయిల్ డిఫరెంట్ గా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఏదో ఒకటి చేసి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకుంటారు. అదే విపక్షంలో ఉన్నప్పుడు ఆయన మౌనంగానే ఉంటుంటారు. మూడేళ్ల నుంచి అసెంబ్లీ సమావేశాలకు వచ్చిందీ తక్కువ సార్లే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావడమే మానేశారు. తన నియోజకవర్గంలోనూ పెద్దగా పర్యటించరు. ఆయన తన అనుచరుల చేత పనులు అక్కడ నడిపిస్తారు.
పట్టించుకోని బాబు...
ఇక పార్టీ సమావేశాలకు కూడా గంటా శ్రీనివాసరావు దూరంగా ఉంటారు. మహానాడు సమావేశానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు. ఇక టీడీఎల్పీ మీటింగ్ లు అన్నా పెద్దగా పట్టించుకోరు. ఇటీవల మినీ మహానాడుల కోసం చంద్రబాబు విశాఖ వెళ్లారు. ఎయిర్ పోర్టుకు వెళ్లి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. చిరునవ్వు నవ్వి వెళ్లిపోయారు. పెద్దగా మాట్లాడకపోవడం, గంటాను గురించి పట్టించుకోక పోవడంతో ఆయనలో ఆలోచన మొదలయింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అయ్యన్న పాత్రుడే అంతా అయి వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కూడా అయ్యన్నకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయ్యన్న పాత్రుడిపై అనేక కేసులు నమోదయ్యాయి. విశాఖ టీడీపీలో ఇప్పుడు అయ్యన్న కీలక నేత. సీనియర్ నేత కూడా కావడంతో ఆయనకు భవిష్యత్ లోనూ ప్రయారిటీ ఉంటుంది. కష్టకాలంలో దూరంగా ఉన్న గంటా శ్రీనివాసరావును పట్టించుకోవాల్సిన అవసరం లేదని పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.
భవిష్యత్ ఉంటుందా?
వాస్తవానికి గంటా శ్రీనివాసరావు జనసేనలో చేరేందుకు ప్రయత్నించారంటారు. మరి ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కాని ఆయన మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారు. గంటాకు టీడీపీ తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇంటికి వచ్చి స్వయంగా కలిశారు. పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లడం వెనక కూడా గంటా ఆలోచన ఉందట. చంద్రబాబు రియాక్షన్ చూసిన తర్వాత యాక్టివ్ కావాలని గంటా శ్రీనివాసరావు భావించే ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. ఇంటికి వచ్చిన గంటా శ్రీనివాసరావును చంద్రబాబు బాగానే రిసీవ్ చేసుకున్నా ఆయనకు అంత సీన్ భవిష్యత్ లో ఉండదని అంటున్నారు పార్టీ నేతలు. టీడీపీ క్రమంగా పుంజుకుంటుండటంతో గంటా టీడీపీలో యాక్టివ్ కావాలని చూస్తున్నట్లుంది. కానీ టీడీపీ లో తనకు ప్రయారిటీ లేకపోయినా ఏదో ఒక పార్టీలో చేరి తిరిగి నెగ్గగలగిన సత్తా గంటాకు ఉందంటున్నారు. అది జనసైన అయినా కావచ్చు. అధికార వైసీపీ అయినా కావచ్చు. చెప్పలేం. గంటా మూడ్ చివరకు ఎటు వైపు మారుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.
Next Story