Thu Jan 02 2025 13:18:51 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ఇది అవసరమా బాబూ.. అక్కడే చూసుకోవడం బెటరేమో?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఇందుకోసం పార్టీ పరిస్థితులపై తెలంగాణలో సర్వేలు కూడా చేయించారన్న వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ టీం సర్వే చేసి కొన్ని నివేదికలను చంద్రబాబుకు ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. తెలంగాణలో ఓటు బ్యాంకు ఉంది కానీ, నాయకత్వలోపం ఉందన్నది ఆ నివేదిక సారంశమట. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. అయితే అందులో విజయావకాశాలపై ఆయన సర్వేచేయిస్తే నాయకత్వ లేమి పార్టీని వెంటాడుతుందని ప్రశాంత్ కిషోర్ టీం చెప్పిందని అంటున్నారు.
అందుకే పోటీ...
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి కనీసం కొన్ని స్థానాల్లో గెలిచినా.. గెలవకపోయినా తమకంటూ ఒక నాయకత్వం ఏర్పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఎటూ ఏపీలో అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి నిధులకు కొరత లేదు. నిధులను వెచ్చించయినా కొన్ని చోట్ల పసుపు జెండాను తెలుగుదేశం జెండాను ఎగురవేయగలిగితే పార్టీకి పూర్వ వైభవం వచ్చినట్లేనని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. ఓట్లు ఉన్నాయి కానీ లీడర్ షిప్ లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలకు ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్నారు. అందుకే లోకల్ బాడీ ఎన్నికల నుంచే పార్టీలో లీడర్లను తయారు చేయడం ప్రారంభిస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజవర్గాల్లో పోటీకి సరైనోళ్లు దొరుకుతారని ఆయన భావిస్తున్నారు.
తిరిగి ప్రాణం పోయాలనుకున్నా...
అందుకే తెలంగాణలో పార్టీకి తిరిగి ప్రాణం పోయడానికి ఆయన ప్రశాంత్ కిషోర్ టీం ను ఉపయోగించుకున్నట్లు అర్థమవుతుంది. అయితే తెలంగాణలో తిరిగి సైకిల్ పార్టీ నిలదొక్కుకోవడం అంత సులువు కాదు. కొన్నిప్రాంతాల్లో తప్ప ఎక్కడా టీడీపీ, వైసీపీ వంటి ఏపీకి చెందిన నాయకత్వం ఉన్న పార్టీలకు అవకాశం మాత్రం లేదన్నది అందరికీ తెలిసిందే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నిధులు, నీళ్లు. నియామకాలపైన. తిరిగి వీరి చేతుల్లో పడితే వాటిలో తమకు అన్యాయం జరుగుతుందని సహజంగానే తెలంగాణ ప్రజలు భావిస్తారు. మొన్నటి వరకూ మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో టీడీపీ కొంత కనిపించినా ఇప్పుడు కేవలం ఖమ్మం జిల్లాలోనే అక్కడక్కడా కనిపిస్తుంది.
అత్యాశే అవుతుంది...
ఖమ్మం జిల్లాలో అది కూడా గెలిచేంత స్థాయిలో టీడీపీ లేదన్నది వాస్తవం. అదే పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కొందరిని మాత్రం ఓడించగలరన్నది అంతే నిజం. ఇక హైదరాబాద్ నగరంలో టీడీపీని అభిమానించే వారున్నప్పటికీ వారి ఓట్లు ఇటు వైపు మరిలే అవకాశాలు లేవనే అనిపిస్తుంది. ఇక్కడ సెటిలయిన వారు కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అనుకూలంగా మారిపోయిన తర్వాత ఇన్నేళ్లు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడం అత్యాశే అవుతుందన్నభావన వారిలో ఉంటుంది. అందుకే చంద్రబాబు కేవలం తెలుగుదేశం పార్టీకి జాతీయ హోదా కోసం పోటీకి దిగవచ్చునేమో కానీ.. గెలవడం మాత్రం అంత ఈజీ కాదు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story