Mon Dec 23 2024 12:41:39 GMT+0000 (Coordinated Universal Time)
నిఖార్సయినోళ్లతోనే నారా గేమ్
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు అవసరం. లేకుటే పార్టీ చీలికలు పీలికలుగా మారుతుంది. ఆ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు.
చంద్రబాబు అనుకున్నది అనుకున్నట్లు పార్టీలో జరగడం లేదు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చు. పార్టీలో నేతలు కొంత యాక్టివ్ అయ్యారు. అంతవరకూ ఆయన గత కొంత కాలంగా పడుతున్న శ్రమకు ఫలితం దక్కినట్లే. కానీ మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఆయన తీసుకున్న మరో కీలక నిర్ణయం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ప్రతి యాభై ఇళ్లకు ఒక కార్యకర్తను నియమించాలని చంద్రబాబు భావించారు. అయితే అందుకు నియోజకవర్గ నేతల్లో కొందరు అత్యుత్సాహం చూపుతున్నారు. తమ ప్రధాన అనుచరులనే యాభై ఇళ్లకు ఒకరిని నియమించేందుకు ముందుకు వస్తున్నారు. ఇది తెలిసిన పెద్దాయన ఆ నియామకాలను ఆపేయాలని ఆదేశాలు ఇచ్చారట.
ప్రతి యాభై ఇళ్లకు...
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు అవసరం. లేకుటే పార్టీ చీలికలు పీలికలుగా మారుతుంది. ఆ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఎన్నికలకు రెండేళ్లు ముందు నుంచే ఆయన ప్రజాక్షేత్రంలోకి పరుగులు పెడుతున్నారు. వయసును పక్కన పెట్టి ఆయన కసితో కాలు దువ్వుతున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ వచ్చే ఎన్నికల్లో ఇబ్బందిగా మారనుందని, ఆ కుటుంబాలను వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా మార్చే ప్రమాదం ఉందని ముందుగానే గ్రహించిన చంద్రబాబు అదే స్థాయిలో తమ పార్టీకి కరడు గట్టిన కార్యకర్తలను నియమించాలని భావించారు. నియోజకవర్గ ఇన్ఛార్జులకు తొలుత ఆదేశాలు కూడా జారీ చేశారు. జాబితాను సిద్ధం చేయమని తెలిపారు. వారికి పార్టీ నుంచి ఎంతో కొంత గౌరవ వేతనం కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
తమకు అనుకూలమైన...
కానీ ఇన్ఛార్జులందరూ తమకు అనుకూలమైన, అనుచరులనే యాభై ఇళ్లకు ప్రతినిధులుగా నియమిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని తెలిసింది. ఒకవేళ పొత్తులు కుదిరి, కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వస్తే అక్కడ ఇన్ఛార్జులు అసంతృప్తికి గురైతే వాలంటీర్లుగా నియమించిన వారు పార్టీకి అనుకూలంగా పనిచేయరని అనుమానం బయలుదేరింది. మరో వైపు టీడీపీ జరిపిస్తున్న సర్వేల్లో అందరు ఇన్ఛార్జులకు సీట్లు దక్కే ఛాన్స్ లేదు. ప్రధానంగా 40 శాతం మంది యువతకు కేటాయించాల్సి ఉంటుంది. ఇది కూడా కొన్ని చోట్ల ఇన్ఛార్జులకు టిక్కెట్ దక్కే అవకాశం లేకపోవడంతో దానిని చంద్రబాబు కోల్డ్ స్టోరేజీ లో పెట్టారంటున్నారు. ఎన్నికలకు ముందు హడావిడిగా వాలంటీర్లను నియమించుకుంటే వాళ్లు అధికార పార్టీ ప్రలోభాలకు గురికారన్న నమ్మకం ఏందన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది.
అందుకే వద్దంది...
అనేక నియోజకవర్గాల నుంచి తొలినుంచి పనిచేస్తున్న కార్యకర్తలను పక్కన పెట్టి తమ వారి పేర్లను జాబితాలో చేర్చినట్లు పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. అందువల్లనే ఇప్పుడే వాలంటీర్ల నియామకం వద్దని పార్టీ నుంచి ఇన్ఛార్జులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందు వాలంటీర్ల పేర్లు ఖరారు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఏడాదిలో ప్రతి ఇంటికి వెళ్లి వారిని టీడీపీ వైపు మళ్లించగలిగే వారినే కార్యకర్తలుగా ఎంపిక చేయాలన్న ఉద్దేశ్యంలో చంద్రబాబు ఉన్నారు. వైసీపీ నియమించిన వాలంటీర్లు ఏజెంట్లుగా ఉండటానికి వీలులేదని ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు అందాయి. కానీ టీడీపీ అనధికారం కావడంతో వారినే పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలన్న భావనలో కూడా ఆయన ఉన్నారు. అందుకే ప్రస్తుతానికి చంద్రబాబు వాలంటీర్ల నియామకాన్ని పక్కన పెట్టారంటున్నారు. నిఖార్సయిన వారి కోసం వెదుకుతున్నారని చెబుతున్నారు.
Next Story