జగన్ వ్యవహారంలో దిద్దుబాటుకు దిగిన టీడీపీ
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం తర్వాత టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. తాము హత్య చేయాలనుకుంటే కుర్రకుంకతో చేయిస్తామా..? మేము చేయిస్తే గిల్లడాలు.. గిచ్చడాలు ఉండవు అంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా తమ పార్టీ చేయాలనుకుంటే జగన్ కైమాకైమా అయ్యేవారని తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఏకంగా జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను వివాదంలోకి లాగారు.
తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో....
వారిద్దరే అధికారం కోసం జగన్ ను చంపాలనుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరీ, ఒక తల్లే కుమారుడిని చంపాలని చూసిందని ఆరోపించడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. దీంతో టీడీపీ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను ఖండించారు. సీరియస్ విషయాలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆ వ్యాఖ్యలు రాజేంద్రప్రసాద్ విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ఈ దాడి వెనక విజయమ్మ ఉందని రాజేంద్రపరసాద్ చేసిన వ్యాఖ్యలను జూపూడి తపపుపట్టారు.