జగన్ వెనుక చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2019లో జరిగిన ఎన్నికల్లో 151 సీట్లు సాధించి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం దేశవ్యాప్తంగా సంచలనం. ఐటీకి ఆద్యుడిగా, మోడర్న్ నాయకుడిగా దేశం దృష్టిలో ఉన్న తెలుగుదేశం అధినేత చిత్తుగా ఓడిపోవడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ అనూహ్య విజయం వెనుక ఖచ్చితంగా చంద్రబాబే ఉన్నారని చెప్పక తప్పదు.
2019లో జరిగిన ఎన్నికల్లో 151 సీట్లు సాధించి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం దేశవ్యాప్తంగా సంచలనం. ఐటీకి ఆద్యుడిగా, మోడర్న్ నాయకుడిగా దేశం దృష్టిలో ఉన్న తెలుగుదేశం అధినేత చిత్తుగా ఓడిపోవడం మరో సంచలనం. జగన్ అనూహ్య విజయం వెనుక ఖచ్చితంగా చంద్రబాబే ఉన్నారని చెప్పక తప్పదు. శత్రువు బలంగా ఉంటే కొందరు పోరాటం నుంచి తప్పుకుంటారు. మరికొందరు మొండిగా, గుడ్డిగా పోరాడతారు. వాళ్లు కూడా అంతిమంగా ఓడిపోతారు. కానీ జగన్ పారిపోలేదు... తప్పుకోలేదు! వ్యూహాత్మకంగా పోరాడారు. బలమైన శత్రువును మరింత బలంగా కొట్టాలని నిర్ణయించుకున్నారు. 2014లో తృటిలో అధికారం చేజారిపోయిన తర్వాత వైకాపా అధినేత ఆలోచన విధానం మారింది. జనాల్లోకి వెళ్లడం, తాను చేయాలనకుంటున్నది చెప్పడం, చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టడం.. ఇదీ ఆయన అజెండా. పాదయాత్ర ద్వారా జనానికి చేరువయ్యారు. ఎక్కడికక్కడ తన బలాన్ని, బలగాన్ని పెంచుకున్నారు. జనంతో మాట్లాడినప్పుడు వాళ్ల అవసరాల మీద దృష్టి పెట్టారు. నవరత్నాలు అనే కాన్సెప్ట్‌ను రూపొందించారు.
అప్పటికే చంద్రబాబు మీద జనానికి అసంతృప్తి పెరుగుతోందని జగన్‌కు తెలుసు. ఐప్యాక్ ద్వారా చేయించుకున్న సర్వేలు ఎప్పకటిప్పుడు ఆయనకు చేరాయి. తెలుగుదేశం ఓడిపోతుందని 2018 నాటికే ఆయనకు అర్థమైంది. కానీ వెనుకడుగు వేయలేదు. మానసికంగా తెలుగుదేశం పార్టీని గట్టిగా దెబ్బతీయాలని అనుకున్నారు. అందుకే నవరత్నాల గురించి విపరీతమైన ప్రచారం చేశారు. ఇది తన బలాన్ని చెప్పడం. తెలుగుదేశం మ్యానిఫెస్టోను పదే పదే ప్రస్తావించారు. అమలుకాని హామీలను జనానికి గుర్తు చేశారు. ముఖ్యంగా రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాన్ని పదే పదే గుర్తుచేసి ఇరకాటంలో పెట్టారు. చివరకు మూణ్నెళ్ల ముందు ఓ వేయి రూపాయలు భృతి కింద చెల్లించాల్సిన పరిస్థితిని కల్పించారు. ఇది ప్రత్యర్థి బలహీనతను బయటపెట్టడం. ఇలా తన అజెండాను దిగ్విజయంగా అమలు చేశారు.
చంద్రబాబుకు ఉన్నంత మీడియా బలం తనకు లేదని తెలుసు. అందుకే ఆచితూచి హామీలు ఇచ్చారు. మీడియాతో మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు... ఓ ఇంటర్వ్యూలో అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారా రిపోర్టర్ అడిగారు. 'ఇదొక క్యాచ్ 22 సిట్యుయేషన్' (సందిగ్ధమైన పరిస్థితి) అంటూ జగన్ ఆ ప్రశ్నను దాటవేశారు. తాను ఏమరుపాటుగా ఉంటే, తొక్కి నారతీయడానికి చంద్రబాబు అనే ఓ ‘పెద్దాయన’ ఉన్నాడని జగన్‌ను తెలుసు. అందుకే ప్రతీ అడుగులో జాగ్రత్తగా ఉన్నారు. తనకు మాత్రమే విశ్వసనీయత ఉందని చెప్పడానికి శతథా ప్రయత్నించారు. ఆ విషయంలో విజయం సాధించారు కూడా.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైకాపా గెలుస్తుందని సర్వేలు చెబుతున్నా జగన్ రిలాక్స్ కావడం లేదు. ఓ చిన్న అవకాశం ఇచ్చినా చంద్రబాబు దానిని సద్వినియోగం చేసుకుంటారని ఆయనకు తెలుసు. ఓడిపోతారేమోనని డౌట్ వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ మార్చేస్తున్నారు. టిక్కెట్లు రాని వాళ్లంతా వైరి పక్షంలో చేరుతారని తెలిసినా, పట్టించుకోవడం లేదు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేసినా, తాను మళ్లీ అధికారంలోకి వచ్చి తీరాల్సిందేననే పట్టుదలతో వైకాపా అధినేత ఉన్నారు. ఇలా జగన్‌ను నిరంతరం అప్రమత్తం చేసి, ఆయన విజయానికి కారణమవుతున్నారు చంద్రబాబు. ఓ నాయకుడి బలానికి ఆయన ప్రత్యర్ధే కారణం కావడం ఏపీ రాజకీయాల వైచిత్రి.