Mon Dec 23 2024 13:47:57 GMT+0000 (Coordinated Universal Time)
బాబుకు ఫైనాన్స్ చేస్తుందెవరు?
తెలుగుదేశం పార్టీ కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని చెప్పారు. గత ఎన్నకల ఫలితాల తర్వాత విరాళాలు కూడా పెద్దగా రాలేదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు రెండేళ్లకు ముందే హీట్ పెంచారు. ఎన్నికల వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టించేందుకు తాపత్రయపడుతున్నారు. మహానాడు నుంచి స్పీడ్ ను పెంచేశారు. ఇక చంద్రబాబు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాల నేతలతో సమావేశం కాకుండా మినీ మహానాడును 26 జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇందుకు భారీ మొత్తంలో వ్యయం అవుతుంది. ఈ వ్యయాన్ని ఎవరు భరిస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్క మినీ మహానాడుకు దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.
మహానాడుకే....
తెలుగుదేశం పార్టీ కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని చెప్పారు. గత ఎన్నకల ఫలితాల తర్వాత విరాళాలు కూడా పెద్దగా రాలేదు. నాయకులు ఆర్భాటంగా విరాళాలు ప్రకటించడమే తప్పించి పార్టీకి సాయం చేయరని చంద్రబాబు స్వయంగా మహానాడులోనే చెప్పారు. ఒంగోలు మహానాడుకే భారీ మొత్తంలో వెచ్చించారు. పొత్తుల్లో పై చేయి సాధించాలన్నా, ప్రజల్లో టీడీపీ వేవ్ ప్రారంభమయిందన్న సంకేతాలను బలంగా పంపాలన్నా మహానాడును పూర్తిగా సక్సెస్ చేయాలనుకున్నారు. అనుకున్నది సాధించారు. కొంత ప్రజల్లో మహానాడుకు వచ్చిన జనంపై చర్చ జరిగేలా చంద్రబాబు చూడగలిగారు.
నియోజకవర్గ నేతలు...
ఒంగోలులో జరిగిన మహానాడుకే దాదాపు 75 కోట్లకు పైగా ఖర్చయినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేయడానికి, అక్కడి ఏర్పాట్లకు భారీగానే ఖర్చు చేశారు. ఇక మినీ మహానాడును ఏర్పాటు చేయడానికి కూడా జిల్లా స్థాయి నేతలు పార్టీ కేంద్రకార్యాలయం వైపు చూస్తున్నారట. జిల్లాల్లో నియోజకవర్గాల నేతలు కొంత మొత్తం వేసుకున్నా అధిక మొత్తం పార్టీ ఇస్తుంది. అందుకే అనకాపల్లి, విజయనగరంలో మినీ మహానాడుకు కేంద్ర పార్టీ చాలా నిధులు వెచ్చించాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇంకా 24 జిల్లాల్లో మినీ మహానాడులు జరపాల్సి ఉంటుంది.
ఇంత ఖర్చు వెనక?
అయితే చంద్రబాబుకు ఆర్థికంగా ఎవరు సహకరిస్తున్నారన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చంద్రబాబు మామూలుగా జిల్లా పర్యటనలకు వెళితేనే పెద్దమొత్తంలో ఖర్చవుతుంది. అలాంటిది రెండేళ్ల ముందే బాబు ఈ ఖర్చును పెట్టడం వెనక ఎవరు ఉన్నారన్నది సస్పెన్స్ గా మారింది. అయితే చంద్రబాబు నిధుల సేకరణ ఇప్పటి నుంచే ప్రారంభించారని, పార్టీ నిలదొక్కుకోవాలంటే ఇప్పటి నుంచే ఖర్చు చేయకతప్పదని చంద్రబాబు భావిస్తున్నారు.
అంతా వారేనా?
అందుకే తనకు గతంలో అండగా నిలిచిన వారందరి వద్ద నుంచి నిధుల సేకరణ ప్రారంభించారంటున్నారు. నియోజకవర్గ నేతలు మాత్రం ఖర్చు చేసేందుకు వెనుకాడుతున్నారు. దీంతో పార్టీయే మొత్తం భరించాల్సి ఉంటుంది. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకునే కొందరు పారిశ్రామికవేత్తలున్నారు. వారి నుంచి మహానాడు, మినీ మహానాడుకు నిధులను సేకరించారని చెబుతున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేస్తే ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటన్న సందేహమూ నేతల్లో కలుగుతుంది. కానీ చంద్రబాబు వద్ద ఫైనాన్స్ ప్లానింగ్ ఉందని కొందరు అంటున్నారు. మొత్తం మీద రెండేళ్లకు ముందే టీడీపీ పెడుతున్న ఖర్చు పై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది.
Next Story