Mon Dec 23 2024 11:34:51 GMT+0000 (Coordinated Universal Time)
హేమిటో.. ఈ ఆట
ట్రాక్ రికార్డున్న జట్లు చతికలపడుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేని జట్లు మాత్రం గెలిచి మైదానంలో ఆనందంతో గంతులేస్తున్నాయి
ట్రాక్ రికార్డున్న జట్లు చతికలపడుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేని జట్లు మాత్రం గెలిచి మైదానంలో ఆనందంతో గంతులేస్తున్నాయి. ఒక్క బంతి మ్యాచ్ ను మలుపు తిప్పతుంది. ఒక్క వికెట్ తో మ్యాచ్ చేజారిపోతుంది. ఒక్క బాల్ తో విజయం దూరమవుతుంది. అదే ఒక్క బాల్ తమకు విజయాన్ని అందిస్తుంది. అంతా కళ్లముందే జరుగుతుంది. కళ్లు చెదిరిపోయే షాట్లు.. అదిరిపోయే బంతులతో ఎగిరిపడుతున్న వికెట్లు. ఇదీ టీ 20 ప్రపంచ కప్ లో చోటు చేసుకున్న సంచలనాలు.
ప్రత్యర్థులకు చుక్కలు...
మొన్న నెదర్లాండ్స్, ఐర్లాండ్, జింబాబ్వే వంటి జట్లు ప్రత్యర్థులకు చుక్కలు చూపుతున్నాయి. వెస్టిండిీస్ రెండు సార్లు ప్రపంచకప్ విజేత. ఫైనల్ లో అది తలపడుతుందని అందరూ భావించారు. కానీ తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో విండీస్ చిత్తుచిత్తుగా ఓడింది. సూపర్ 12 లోకి ప్రవేశించకుండానే ఇంటిదారి పట్టింది. బౌలింగ్, బ్యాటింగ్ లో పటిష్టంగా ఉన్న జట్టు పసికూన చేతిలో పరాజయం పాలయి ముఖం చూపడానికి కూడా వీలులేకుండా స్వదేశానికి వెళ్లడం విషాదమే.
శ్రీలంక చావు తప్పి...
శ్రీలంకది కూడా అదే పరిస్థితి. చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా నమీబియా చేతిలో అది చిత్తుగా ఓడింది. శ్రీలంక నమీబియా చేతిలో ఓటమి పాలయినా తర్వాత కొంత పుంజుకుంది. తర్వాత నెదర్లాండ్ మీద చచ్చీ చడీ గెలిచి సూపర్ 12 లోకి ప్రవేశించింది. ఒక దశలో శ్రీలంక కూడా ఇంటి దారి పట్టకతప్పదన్న భావన నెలకొంది. ఇక నెదర్లాండ్స్ కూడా మామూలుగా ఆడటం లేదు. బౌలింగ్, బ్యాటింగ్ లో తన ప్రతిభను కనపరుస్తూ అసలైన మజాను క్రికెట్ ప్రేమికులకు చూపుతుంది. భారత్ తో జరిగిన మ్యాచ్ లోనూ నెదర్లాండ్స్ ఆట తీరు అందరినీ ఆకట్టుకుంది.
జింబాబ్వే చేతిలో...
తాజాగా జింబాబ్వే చేతిలో పాక్ ఓటమి పాలయింది. ఇది కూడా ఎవరూ ఊహించనదే. అంచనాలకు భిన్నంగా జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠత మధ్య విజయాన్ని సొంతం చేసుకుంది. స్కోర్ బోర్డులో పాక్ కంటే జింబాబ్వే అగ్రస్థానంలోకి వచ్చింది. మూడు పాయింట్లతో నిలిచింది. భారత్ తో ఒక్క పరుగుతో ఓటమి పాలయిన పాకిస్థాన్ మిగిలిన మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని పాక్ అభిమానుల అంచనాలు తలకిందులయ్యాయి. జింబాబ్వే ఊహించని విధంగా గెలిచి తమది కూడా సత్తా ఉన్న జట్టు అని నిరూపించుకుంది.
ఎవరినీ తక్కువగా...
వరల్డ్ కప్ లో అలాంటి సంచనాలు నమోదవుతున్నాయి. చిన్న జట్టు అని ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేకుండా ఉంది. ఏ జట్టులో ఏ ఆటగాడు ఎలా చెలరేగుతాడన్నది ముందుగానే అంచనా వేయడం కష్టం. మైదానంలోనే చూడాల్సి వస్తుంది. అది కూడా గుడ్లప్పగించుకుని. ఇప్పటి వరకూ వరల్డ్ కప్ లో జరిగిన ప్రధాన మ్యాచ్ లన్నీ ఉత్కంఠ భరితంగానే సాగాయి. ఈసారి కప్ పలానా వారికి వస్తుందన్న అంచనా వేయడం మూర్ఖత్వమే అవుతుంది. క్రీడా పండితుల అంచనాలకు మించి టీ 20 పోరు సాగుతుంది.
Next Story