Mon Nov 25 2024 18:44:02 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ స్ట్రాటజీ సక్సెస్ అయిట్లేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు రచించడంలో దిట్ట. రాజకీయాల్లో ఆయన వ్యూహాలు ఎప్పుడూ లెక్క తప్పలేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు రచించడంలో దిట్ట. రాజకీయాల్లో ఆయన వ్యూహాలు ఎప్పుడూ లెక్క తప్పలేదు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన స్ట్రాటజీలు 99 శాతం ఫలించాయనే చెప్పాలి. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా, సాధించింది తానేనని చెప్పుకుని 2014లో టీఆర్ఎస్ ను గెలిపించుకున్నారు. 2019 లో జరగాల్సిన ఎన్నికలను ఒక ఏడాది ముందుగానే తీసుకెళ్లి తిరిగి రెండోసారి సక్సెస్ అయ్యారు. రెండుసార్లు వరసగా గెలవడం వెనక కేసీఆర్ వ్యూహాలే పనిచేసేయాని చెప్పక తప్పదు.
టీడీపీని ఖాళీ చేసి...
ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ఎప్పటికైనా తనకు శత్రువుగా మారుతుంది. ఆ విషయాన్ని ముందుగానే అంచనా వేసిన కేసీఆర్ తొలి నుంచి ఆ పార్టీని బలహీనం చేస్తూ వస్తున్నారు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకుని ఏకంగా మంత్రిపదవులు ఇచ్చారు. ఇక కొద్దో గొప్పో రాష్ట్ర విభజన తర్వాత అక్కడకక్కడ కొంత బలం ఉన్న తెలుగుదేశం పార్టీని పూర్తిగా భూస్థాపితం చేశారు. టీడీపీకి తెలంగాణలో చోటు లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. 2018లో కాంగ్రెస్ లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకుని సీఎల్పీనే విలీనం చేసే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ బలహీనం చేసి...
కాంగ్రెస్ వీక్ అవుతుంది కాని బీజేపీ బలపడటం లేదని గ్రహించిన కేసీఆర్ మరింత దానికి ఊపు తెచ్చే విధంగా కొంత కాలంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని పరోక్షంగా ప్రజల్లోకి పంపించగలిగారు. బీజేపీ 119 నియోజకవర్గాల్లో ఈ ఏడాదిన్నర కాలంలో బలపడే అవకాశాలు లేవు. ఆ పార్టీకి సింగిల్ డిజిట్ తప్ప అసెంబ్లీ స్థానాలు రావని కేసీఆర్ కు తెలియంది కాదు. కానీ ప్రతి నియోజకవర్గంలో ఓటు బ్యాంకు ఏర్పడాలి. తనపైనా, ప్రభుత్వంపైనా ప్రజల్లో వ్యతిరేకత మొదలయిందని ఆయన చేయించుకున్న సర్వేల్లో స్పష్టంగా తెలుస్తోంది.
వ్యతిరేక ఓటు చీలి...
అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి. కేసీఆర్ కు కావాల్సింది అదే. బీజేపీ కొంత పుంజుకుంటే, కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు భారీగా గండి పడుతుంది. తనకు వచ్చే ఎన్నికల్లోనూ ఢోకా ఉండదు. అందుకే బీజేపీని ప్రధాన శత్రువుగా కేసీఆర్ చూస్తున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ వాడిన కేసీఆర్ దానికి ఎక్సైపయిరీ డేట్ అయిపోవడంతో ఇప్పుడు బీజేపీ బలోపేతం కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అంత సులువు కాదు. కానీ కాంగ్రెస్ కు అన్ని రకాలుగా అవకాశాలున్నాయి. అందుకే కేసీఆర్ ముందు జాగ్రత్తగా బీజేపీని శత్రువుగా చూపిస్తూ దాని ఓటు బ్యాంకును కొంతవరకూ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం పెద్ద కష్టమేమీ కాదన్నది విశ్లేషకుల అంచనా.
Next Story