Mon Nov 25 2024 16:52:39 GMT+0000 (Coordinated Universal Time)
కారుకు "హ్యాండ్" బ్రేక్....?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని చూస్తున్నారు. రెండు దఫాలు ఒంటి చేత్తో అధికారాన్ని తేగలిగారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని చూస్తున్నారు. గత రెండు దఫాలు ఆయన ఒంటి చేత్తో అధికారాన్ని సులువుగా తేగలిగారు. ఈసారి మాత్రం అంత తేలిక కాదు. శ్రమించాల్సిందే. కేసీఆర్ ఎన్నడూ పాదయాత్రలు చేయలేదు. ఒక సభ పెట్టి తన ఉపన్యాసం ద్వారానే జనాన్ని ఆకట్టుకోగలిగారు. అయితే తొమ్మిదేళ్ల గులాబీ బాస్ పాలనను చూసిన జనం ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగానే మారింది. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనతతో కేసీఆర్ పార్టీని అధికారంలోకి తేగలిగారు. రెండో దఫా అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరుతో జనంలో వెళ్లికి వారికి చేరువ కాగలిగారు. మరో వైపు రెండు దఫాలు సెంటిమెంట్ రంగరించగలిగారు.
నో సెంటిమెంట్...
కానీ ఈసారి సెంటిమెంట్ అనేది పెద్దగా కనపడదు. తన పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి, ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే ప్రయత్నం మొదలుపెట్టి, జాతీయ పార్టీగా ప్రకటించుకున్నప్పుడే సెంటిమెంట్ ఇక స్టాప్ అయినట్లే. తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పదం తొలగించినప్పుడే సెంటిమెంట్ కూడా దూరమయిందను కోవాలి. తొమ్మిదేళ్ల పాలనపై సహజంగా వెల్లువత్తే వ్యతిరేకతను రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పంచుకోగలిగితేనే కేసీఆర్కు లాభం. అలా కాకుండా అందులో ఏ ఒక్క పార్టీ వైపో ప్రజలు మొగ్గు చూపారంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేందుకు అవకాశం లేదు. అందుకే ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ప్రతి నియోజకవర్గంలో బలంగా ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారు.
అసంతృప్తి సహజమే...
కానీ చివరకు తేల్చాల్సింది ప్రజలే. బీజేపీ తెలంగాణలో బలీయమైన శక్తి కాదన్నది అందరికీ తెలిసిందే. కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలలోనే ఆ పార్టీ బలంగా కనిపిస్తుంది. అది కూడా గెలుపు సాధించేంత కాదు.కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోనూ హోప్స్ పెరిగాయి. జనంలో మార్పు మొదలయిందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలతో పార్టీ కొంత ప్రజలకు చేరువయ్యేందుకు తోడ్పడింది. కేసీఆర్ ప్రభుత్వం పట్ల కొన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నది నిజమన్నది వీరి పాదయాత్రలో స్పష్టమైంది. సంక్షేమ పథకాలే కొన్ని ఈసారి కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే అవకాశముంది. కర్ణాటక తరహాలోనూ కాంగ్రెస్ గ్యారంటీ కార్డును ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయనుంది. అదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కే బదిలీ అయ్యే అవకాశాలున్నాయి.
పెరిగిన ఆత్మ విశ్వాసం...
అదే జరిగితే ఈసారి ఎన్నికల్లో ఫలితం ఎలాగైనా ఉండే అవకాశముంది. సరైన అభ్యర్థుల ఎంపికతో పాటు నేతల మధ్య ఐక్యత ఉంటే చాలు కేసీఆర్ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్న ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ నేతలున్నారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే కొంత ఎడ్జ్ కాంగ్రెస్ వైపు ఉండే అవకాశాలు లేకపోలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సంక్షేమ కార్డుతో ముందుకు రానున్నారు. కొత్త కొత్త స్కీమ్లతో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దళిత బంధు ప్రకటించిన కేసీఆర్ బీసీ బంధును కూడా ప్రకటించారు. అయితే దళిత కుటుంబానికి పది లక్షలు ప్రకటించి కొందరికే నిధులు విడుదల చేశారు. పథకం దక్కని మిగిలిన వారు అసహనంతో ఉన్నారు. అలాగే బీసీ బంధు కింద ప్రతి బీసీ కుటుంబానికి లక్ష రూపాయల సాయం ప్రకటించారు. అయితే ఎంత మేర ఇది వర్క్ అవుట్ అవుతుందన్నది చూడాలి. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఉన్న వ్యతిరేకత ఎలాగూ ఉండనే ఉంది. వీటన్నింటినీ తట్టుకుని హ్యాట్రిక్ విక్టరీని కేసీఆర్ కొట్టగలిగితే మాత్రం ఇక ఆయనకు తిరుగులేనట్లే. మరి కొద్దినెలల్లో జనం ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతుందన్నది చూడాల్సి ఉంది.
- Tags
- kcr
- ts politics
Next Story