Tue Nov 26 2024 22:40:38 GMT+0000 (Coordinated Universal Time)
క్రిస్మస్ తర్వాత కేసీఆర్ కారు స్పీడ్?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కార్యక్రమాలను ముమ్మరం చేసే ప్రయత్నంలో ఉన్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కార్యక్రమాలను ముమ్మరం చేసే ప్రయత్నంలో ఉన్నారు. క్రిస్మస్ తర్వాత ఢిల్లీ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కిసాన్ సెల్ ను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ఈ మేరకు ఆయన కసరత్తులు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. క్రిస్మస్ తర్వాత ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి పార్టీ విధివిధానాలను కూడా ప్రకటించనున్నారు. కొత్త ఏడాది రాకముందే ఈ కార్యక్రమాలను చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు.
కిసాన్ సెల్ ల ఏర్పాటు...
"అబ్ కి బార్ కిసాన్ సర్కార్" అనే నినాదాన్ని దేశమంతా వినిపించేందుకు చర్యలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో తొలుత కిసాన్ సెల్ లను పార్టీకి అనుబంధంగా ఏర్పాటు చేయనున్నారు. దీనిపై ఇప్పటికే కేసీఆర్ ఒక క్లారిటీకి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలుత కిసాన్ సెల్ లను ఏర్పాటు చేసిన తర్వాతనే పార్టీ కమిటీలను రాష్ట్రాల్లో వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రధానంగా రైతు ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన పార్టీ బీఆర్ఎస్ అన్నది ప్రజలలోకి బలంగా తీసుకెళ్లాలన్నది గులాబీ బాస్ యోచన.
పాటలను కూడా...
ఇక వివిధ భాషల్లో పార్టీకి సంబంధించి పాటలను కూడా రెడీ చేస్తున్నారని తెలిసింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సాంస్కృతిక పరంగా, పాటల పరంగానే ప్రజలలో చైతన్యం తేగలిగామని, అందుకే ఇప్పుడు కూడా అదే రూట్ లో వెళ్లాలని కేసీఆర్ ఆ బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. మరాఠీ, కన్నడ, హిందీ భాషల్లో కవులను సంప్రదించి వారి చేత పాటలు రాయించే బాధ్యతను కేసీఆర్ ఒక టీమ్ కు అప్పగించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాటి ద్వారా పార్టీని వేగంగా అంటే 2024 ఎన్నికల నాటికి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఐడియాతో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు.
అందరితో భేటీలు...
అనేక రాష్ట్రాల్లో కలసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా కలసి నడిచేలా పార్టీలతో పోటీ చేసి ఓట్లు చీలకుండా విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఢిల్లీలో నెలకు పది రోజులకు పైగానే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం మాత్రమే కాకుండా మేధావులు, వివిధ వర్గాల వారితో ప్రత్యేకంగా సమావేశమై దేశంలో దాదాపు ఏడు దశాబ్దాల నుంచి నెలకొన్న పరిస్థితులను వివరించే యత్నంలో ఉన్నారు. మొత్తం మీద క్రిస్మస్ పండగ తర్వాత కేసీఆర్ స్పీడ్ పెంచే అవకాశాలున్నాయన్నది గులాబీ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
Next Story