నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టే యత్నం.. కేసీఆర్ సంచలన కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో జరిగిన ఘటనలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి అందరూ హైకోర్టు న్యాయమూర్తులకు, ముఖ్యమంత్రులకు, మీడియాకు పంపానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ దేశంలో జరుగుతున్న దుర్మార్గం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఈరోజు ప్రజాస్వామ్య హత్య గతంలో ఎప్పుడూ చూడలేదని, ఇది ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదమని ఆయన అన్నారు. తాను కూడా షాక్ కు గురయ్యానని ఆయన తెలిపారు. దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన కేంద్ర ప్రభుత్వం భారత ప్రజాస్వామ్య జీవనాడులను దెబ్బతీసే విధంగా వ్యవహరించిందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఉంది కాబట్టి తాను మీడియా ముందు రాలేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ దారుణంగా వ్యవహరించిందన్నారు. పాల్వాయి స్రవంతి తనను కలసినట్లు తప్పుడు వార్తలను సృష్టించారన్నారు. ఇండియా ఆకలి రాజ్యంగా మారబోతుందన్నారు. మునుగోడు పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రజలకు తెలియజేద్దామనే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. చాలా బాధతో తాను మాట్లాడుతున్నానని కేసీఆర్ అన్నారు. ఈసీపై కూడా చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.