Thu Jan 16 2025 05:05:24 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారట
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్ధమయినట్టే కన్పిస్తుంది. జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్ధమయినట్టే కన్పిస్తుంది. మరో రెండేళ్లు ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ముందుగా తానే జనం చెంతకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుంది. విపక్షాలు తేరుకునేలోగా కేసీఆర్ ప్రజల చెంతకు వెళ్లి వాళ్ల ఆశీర్వాదం మరోసారి కోరనున్నారు. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేసీఆర్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
పార్టీ పరంగా...
పార్టీ పరంగా పూర్తిస్థాయిలో కమిటీలను నియమించి ఎన్నికలకు టీం ను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు మంత్రి వర్గాన్ని కూడా త్వరలో విస్తరించే అవకాశముందని చెబుతున్నారు. ఎన్నికలకు వెళ్లే ముందు పెద్దయెత్తున హామీలను అమలు పర్చే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. ప్రధానంగా దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు పర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అయిన తర్వాత దాని ఊసు మర్చిపోయారన్న విమర్శలకు కేసీఆర్ త్వరలో చెక్ పెట్టనున్నారు.
కొత్త పథకాలు...
బీసీలకు కూడా కేసీఆర్ వరాలు ప్రకటించే అవకాశాలున్నాయి. మైనారిటీలను కూడా మచ్చిక చేసుకునేందుకు కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నారు. వీటన్నింటికి తోడు కేసీఆర్ జిల్లాల్లో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ జిల్లాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలను కేసీఆర్ చేయనున్నారు. ఈ నెల 19 వ తేదీ నుంచి కేసీఆర్ టూర్ ఖరాయింది. ఈ మేరకు సీఎంవో అధికారులు కూడా ప్రకటించారు.
జిల్లాల పర్యటన...
ఈ నెల 19వ తేదీన వనపర్తి జిల్లాలో, 20వ తేదీన జనగామ జిల్లాల్లో కేసీఆర పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇక నెలలో కొన్ని రోజులు జిల్లాల పర్యటన చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. వారానిక ఒక జిల్లా చొప్పున పర్యటించేలా కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో జనంలోకి వెళ్లి ఏడేళ్లుగా తాను చేసిన అభివృద్ధితో పాటు సాధించిన ప్రగతిని కేసీఆర్ ప్రజలకు వివరించనున్నారు.
Next Story