Thu Jan 16 2025 19:41:02 GMT+0000 (Coordinated Universal Time)
2021 కేసీఆర్ కు కలిసొచ్చిందా? చికాకు పెట్టిందా?
కేసీఆర్ కు 2021 వ సంవత్సరం కలసి రాలేదనే చెప్పాలి. రాజకీయంగా, పాలనా పరంగా ఆయన ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థుడు. ఆయన తిమ్మిని బొమ్మిని చేయగలరు. ఆయన వ్యూహాలు ఎప్పుడూ ఫెయిల్ కావంటారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, తెలంగాణ ప్రజల మనసెరిగిన నేత కావడంతో ఆయన రెండు సార్లు వరసగా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ప్రత్యర్థులను ఎప్పటికప్పుడు బలహీనం చేసుకుంటూ తాను బలోపేతం కావడమే కేసీఆర్ మార్గం. ఆ మార్గంతోనే ఆయన ఇప్పటి వరకూ సక్సెస్ సాధించారు. రాజకీయాల్లో ఆయన సక్సెస్ రేట్ ఎంత అంటే 99 శాతం అని ఠక్కున రాజకీయ విశ్లేషకులు చెబుతారు.
ఈ ఏడాది మాత్రం.....
అలాంటి కేసీఆర్ కు 2021 వ సంవత్సరం కలసి రాలేదనే చెప్పాలి. రాజకీయంగా, పాలనా పరంగా ఆయన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి మరచి పోకముందే ఈ ఏడాది హుజూరాబాద్ ఉప ఎన్నికలో దారుణ ఓటమిని చూడాల్సి వచ్చింది. దుబ్బాక అయితే కేసీఆర్ పెద్దగా సీరియస్ గా కూడా తీసుకోలేదు. కానీ హుజాబాద్ అలా కాదు. దాదాపు 600 కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో అక్కడ పంచిపెట్టారన్నది బహిరంగ రహస్యం.
ఈటల ఎపిసోడ్ తో....
2021లో ఈటల రాజేందర్ తోనే కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. ఆయనను వదిలించుకోవడానికే డిసైడ్ అయ్యారు. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించడంతో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల. అప్పటి నుంచి కేసీఆర్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. దళిత బంధు పథకాన్ని కేవలం హుజూరాబాద్ నియోజకవర్గం కోసమే తెచ్చారు. అక్కడ ఓటమి పాలయినా ఇది వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు గుదిబండగా మారనుంది. రెండేళ్లలో కేసీఆర్ ప్రతి దళితకుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా కొట్టినా 2023 ఎన్నికల్లో బూమ్ రాంగ్ కాకతప్పదు.
అన్నీ చికాకులే....
2021లో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కొంత ఊరట కలిగించినా ఈ ఏడాది పార్టీలో జరిగిన పరిణామాలు పెద్దాయనకు చికాకు కలిగించాయనే చెప్పాలి. గత ఏడేళ్లలో ఎప్పుడు లేనిది కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో దీక్షకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. చివరకు విజయం సాధించగలిగారు. కానీ బీజేపీ ఎదుగుతుండటం ఆయన పార్టీకి భవిష్యత్ లో ఇబ్బంది కరమే. అందుకే కేసీఆర్ ఇటీవల కాలంలో బీజేపీని టార్గెట్ చేశారు. ఇదే ఏడాది తాను అన్నింటా వ్యతిరేకించే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ కావడం కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారు. మొత్తం మీద కేసీఆర్ కు 2021 మాత్రం పెద్దగా అచ్చిరాలేదనే చెప్పాలి.
Next Story