Mon Nov 18 2024 03:20:08 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ హామీలు.. ఒక్క ఛాన్స్ అంటూ..?
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను ఆకర్షించే విధంగా హామీలు ఇస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను ఆకర్షించే విధంగా హామీలు ఇస్తున్నారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఆయన వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే పేదల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలను ఇస్తామని ప్రకటించారు.
రెండు లక్షల రుణమాఫీ...
రైతులకు రెండు లక్షల రుణ మాఫీని చేస్తామని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయీని కూడా పూర్తిగా చెల్లిస్తామని చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతామని రేవంత్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చారు. 800 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయీలను కూడా వెంటనే చెల్లిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఆరోగ్య శ్రీ పరిమితి...
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క సారి ఛాన్స్ ఇవ్వాలంటూ ఆయన ప్రజలను అభ్యర్థించారు. రెండు దఫాలు కేసీఆర్ కు అవకాశమిచ్చినా అప్పుల్లో ముంచారని, కల్వకుంట్ల కుటుంబం బాగుపడటం తప్ప తెలంగాణ సమాజం బాగోగులు కేసీఆర్ కు పట్టలేదని రేవంత్ రెడ్డి మండి పడ్డారు. ప్రధానంగా మహిళలు, యువత ముందుకు వచ్చి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు అండగా నిలబడాలని కోరారు. కాంగ్రెస్ 2023లో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రేవంత్ రెడ్డి కార్నర్ సభలకు పెద్దయెత్తున ప్రజలు హాజరవుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Next Story