Mon Dec 23 2024 05:27:51 GMT+0000 (Coordinated Universal Time)
రాజన్ కు నిరసన సైరన్
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య చాలా కాలం నుంచి పొసగడం లేదు
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య చాలా కాలం నుంచి పొసగడం లేదు. రాజ్‌భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య దూరం పెరిగింది. రాజ్‌భవన్ వైపుకు వెళ్లేందుకు కూడా మంత్రులు ఇష్టపడటం లేదు. అలాగే గవర్నర్ కూడా ప్రభుత్వంపై విమర్శలను చేయడం వదిలిపెట్టడం లేదు. ఏ మాత్రం అవకాశం దక్కినా ప్రభుత్వంపై గవర్నర్ విరుచుకుపడుతున్నారు. దీంతో గవర్నర్ సౌందర్ రాజన్ ను కంట్రోల్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కొన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
కీలక బిల్లులను...
ఇప్పటికే గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పలు కీలక బిల్లులను ఆమోదించకపోవడం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను గవర్నర్ కాలయాపన చేస్తూ అమలు కాకుండా చూస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. తమను వ్యతిరేకించే వారిని ప్రోత్సహిస్తూ ప్రజల్లో గవర్నర్ తప్పుడు సంకేతాలను పంపుతున్నారని కూడా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గవర్నర్ ప్రభుత్వంపై పెత్తనం చేయాలని చూస్తున్నారని, ఆమె బీజేపీ నేతలా వ్యవహరిస్తున్నారని కూడా కొందరు ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు.
మంత్రి స్వయంగా వెళ్లి...
ఈ నేపథ్యంలో యూనివర్సిటీల్లో ఉమ్మడి రిక్రూట్మెంట్ బిల్లు విషయంలో గవర్నర్ నేరుగా అధికారులను వివరణ కోరారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి అధికారులతో కలసి వెళ్లి ఆమెకు బిల్లు విషయంలో ఉన్న అనుమానాలను తొలగించేందుకు ప్రయత్నించారు. అయినా బిల్లు మాత్రం ఆమోదం పొందలేదు. మంత్రి, ఉన్నతాధికారులు వెళ్లి చెప్పినా బిల్లులు పెండింగ్ లో పెట్టడాన్ని టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. ఇలా అడ్డంకులు సృష్టిస్తుంటే పాలన ఎలా సాగుతుందని గులాబీ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ ను రీకాల్ చేయాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నెలలో....
అందుకే యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ పదవి నుంచి గవర్నర్ ను తప్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈనెలలోనే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే గవర్నర్ ను తప్పిస్తూ బిల్లును పెడతారంటున్నారు. ఇప్పటికే కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఈ తరహా బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాయి. ఆ బిల్లులను కూడా అక్కడి గవర్నర్లు ఆమోదించలేదనుకోండి. అది వేరే విషయం. గవర్నర్ ఏకపక్ష వైఖరిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఈ బిల్లును ఈ నెలలో జరిగే సమావేశాల్లోనే తేవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలియ వచ్చింది. మరి ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. మొత్తం మీద గవర్నర్ కు గవర్నమెంట్ కు మధ్య పెరిగిన గ్యాప్ ఈ నెలలో మరింత పెరిగే అవకాశముందని మాత్రం చెబుతున్నారు.
Next Story