Mon Dec 23 2024 00:19:39 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్-చెక్ పుస్తకం విడుదల చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి
అసలు తప్పుడు సమాచారం ఎలా ఉద్భవిస్తుంది ? ఫ్యాక్ట్ చెకింగ్ ప్రాముఖ్యత ఏమిటి ? తప్పుడు సమాచారాన్ని కనుగొనేందుకు వాడే...
తెలుగులో తొలి ఫ్యాక్ట్ చెకింగ్ పుస్తకం ఆవిష్కరణ
తప్పుడు సమాచారం, అబద్ధపు సమాచారాన్ని ఎదుర్కొనేందుకు ఉపయోగపడే పుస్తకం
చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ వరకూ అన్నివిషయాలపై లోతైన విశ్లేషణ
తెలుగులో మొట్టమొదటి ఫ్యాక్ట్ చెక్ పుస్తకం "ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా" అనే పుస్తకాన్ని ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి బుధవారం హై కోర్టు ఆవరణలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి, ఫ్యాక్ట్ చెకర్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ సత్యప్రియ బిఎన్ లు కలిసి రచించారు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో సోషల్ మీడియా ప్రాధాన్యం ఎంతో పెరిగిపోయింది. ఇందులో ప్రధానంగా తప్పుడు సమాచార వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. అలాంటి తప్పుడు సమాచారాన్ని ఎలా ఎదుర్కోవాలి ? దానికోసం మనం తెలుసుకోవాల్సిన అంశాలపై "ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా" పుస్తకం అద్భుతమైన అవగాహన కల్పిస్తుంది.
ఈ సందర్భంగా జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి మాట్లాడుతూ... "ఫ్యాక్ట్ చెక్కు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు నాకు చాలా ఆనందంగా వుంది, ఫ్యాక్ట్ చెక్‌ను ప్రచారం చేయాలనే ఆలోచన పట్ల నేను సంతోషిస్తున్నాను. ప్రజలలో పెరుగుతున్న అవగాహన, ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో, వాస్తవాలను తనిఖీ చేసే ఒక వ్యవస్థను కలిగి ఉండటం ఎంతో అవసరం, తద్వారా ఆసక్తి ఉన్నవారందరికీ ప్రయోజనం చేకూరుతుంది. ఏ ఒక్కరినో శక్తివంతం చేయకుండా వ్యవస్థ సమతుల్యంగా నడవాలి కాబట్టి ప్రతి ప్రొఫెషనల్, ప్రతి కార్యాచరణకు కొంత బాధ్యత అనేది ఉండాలి. వార్తలు, తప్పుడు సమాచారం యొక్క తప్పుడు రిపోర్టింగ్ , ఉద్దేశపూర్వకంగా హానికరమైన ప్రచారం చేయడం వంటి సంఘటనల గురించి మనందరికీ తెలుసు. అందువలన, తప్పుడు రిపోర్టింగ్ , తప్పుడు సమాచారం యొక్క బాధితులకు ఒక వేదికను కలిగి వుండాలి. అందుకు ఈ ఫ్యాక్ట్ చెక్ పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా వరకు వారి మనోవేదనలను వెల్లడి చేయడంలో వారికి సహాయపడుతుంది. తప్పుడు సమాచారం, నివేదికల వల్ల బాధితులైన వ్యక్తులు ఎక్కువగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తారని మనందరికీ తెలుసు. ఈ ఫ్యాక్ట్ చెక్‌ను ఒక మధ్యవర్తిత్వ వ్యవస్థగా నేను భావిస్తున్నాను. తటస్థ వ్యక్తులుగా ఉండే ఈ భావనను సమాజానికి, భాగస్వామ్యులందరికీ ప్రమోటర్లు మంచి సేవలను అందిస్తారని భావిస్తున్నాను. బాధితులకు, పోలీసు, న్యాయస్థానాల వంటి వ్యవస్థల మధ్య, మధ్యవర్తులు అందుబాటులో ఉంటే, అది బాధితునికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రజా ప్రయోజనాలకు అది ఉపకరిస్తుంది. ప్రెస్ అనేది రాజ్యాంగానికి ఒక విధంగా కాపలాదారుగా పనిచేస్తూ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన భూమికను పోషిస్తున్నది కాబట్టి, కొంత కౌంటర్ చెక్ మెకానిజం కూడా ఉండాలి. ఈ ఫ్యాక్ట్ చెక్ పుస్తకం అనేది అనేక మందికి ఖచ్చితంగా తప్పుడు రిపోర్టింగ్, తప్పుడు సమాచారం బాధితులకు ప్రయోజనం చేకూరుస్తుందని నేను భావిస్తున్నాను.’’ అని జస్టిస్ బి విజయసేన్ రెడ్డి తెలిపారు.
పుస్తకావిష్కరణ సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీ జర్నలిజం విభాగాధిపతి, సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ కె స్టీవెన్సన్ మాట్లాడుతూ.. ‘‘చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్‌ల వరకు ఈ పుస్తకం ప్రకృతి వైపరీత్యాలు, పబ్లిక్ ప్రచారాలు మరియు మహమ్మారి సమయంలో ఏం జరుగుతుందనే విషయాలపై అవగాహన కల్పిస్తుంది." అని పేర్కొన్నారు.
అసలు తప్పుడు సమాచారం ఎలా ఉద్భవిస్తుంది ? ఫ్యాక్ట్ చెకింగ్ ప్రాముఖ్యత ఏమిటి ? తప్పుడు సమాచారాన్ని కనుగొనేందుకు వాడే టూల్స్ గురించి, ఇమేజ్, టెక్ట్స్, వీడియో వెరిఫికేషన్ వంటి అంశాలపై ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించారు. అదేవిధంగా.. ఫేక్ న్యూస్ అంటే ఏమిటి ? నిజ నిర్థారణ ప్రాథమిక సూత్రాలు, క్లెయిములు ఎలా ఎంపిక చేసుకోవాలి ? టెక్ట్స్, ఫొటో, వీడియో ఆడియో వెరిఫికేషన్, విమర్శనాత్మక ఆలోచన, జియో లొకేషన్ ను కొనుగొనడం? మెటాడేటా, డొమైన్ ను పరిశోధించడం, సమాచార మూలాలను కనుగొనడం, డేటా వెరిఫికేషన్, క్లైమెట్ ఛేంజ్ వెరిఫికేషన్, ఆరోగ్య సంబంధ పోస్టుల ఫ్యాక్ట్ చెకింగ్, డీప్ ఫేక్, సోషల్ మీడియా ఆడిట్, వార్తల సేకరణ, గూగుల్ ట్రెండ్స్, డిజిటల్ సేఫ్టీ, ఫ్యాక్ట్ చెకర్స్ లక్షణాలు, ఫ్యాక్ట్ చెక్ రాయడంలో మౌలికాంశాలు, తప్పుడు సమాచారంపై చట్టాలు నాడు నేడు.. తదితర విషయాలను ఈ పుస్తకంలో వివరించారు. అంతే కాకుండా.. వివిధ ఐటీ, పత్రికా చట్టాలకు సంబంధించిన అంశాలను కూడా ఇందులో వివరించారు. అంతర్జాతీయంగా ఫ్యాక్ట్ చెకింగ్ కు సంబంధించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. కానీ తెలుగులో వెలువడిన మొట్టమొదటి ఫ్యాక్ట్ చెకింగ్ వెరిఫికేషన్ హ్యాండ్ బుక్ ఇదే.
ఈ పుస్తకం న్యాయ నిపుణులు, జర్నలిస్టులు, జర్నలిజం విద్యార్థులు, ఫ్యాక్ట్ చెకర్స్, మీడియా అధ్యాపకులు, పీ ఆర్ (PR) నిపుణులు, రాజకీయ శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు, సాధారణ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. వాట్సాప్ లలో వచ్చే ఫార్వర్డ్ మెసేజ్ లు, పోస్టులు లేదా ఫేస్బుక్ పోస్ట్‌లు లేదా ఆన్లైన్లో ఏదైనా సమాచారం వెనుక ఉన్న నిజం తెలుసుకోవాలనుకునే సాధారణ వ్యక్తులు కూడా ఈ పుస్తకాన్ని ఉపయోగించవచ్చు. ఇందులో 'నకిలీ వార్తలు', తప్పుడు సమాచారం, తప్పుడు సమాచారంతో పోరాడేందుకు కావలసిన ప్రాథమిక, అధునాతన సాంకేతికతలు, సాధనాలు క్లుప్తంగా ఉన్నాయి.
"ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా" పుస్తక రచయితల్లో ఒకరైన ప్రముఖ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి గతంలో రెడ్ శాండర్స్ స్మగ్లింగ్‌పై పరిశోధనాత్మక రచన 'బ్లడ్ సాండర్స్ - ది గ్రేట్ ఫారెస్ట్ హైస్ట్' అనే పుస్తకాన్ని రచించారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రెస్ క్లబ్‌లు, మీడియా అకాడమీలలో నిజనిర్ధారణ నైపుణ్యాలపై సుధాకర్ రెడ్డి వందలాది మంది జర్నలిస్టులు, జర్నలిజం విద్యార్థులు, లా గ్రాడ్యుయేట్లు, మీడియా అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన APAC విశ్వసనీయ మీడియా సమ్మిట్, గ్లోబల్ ఫ్యాక్ట్ 10, దక్షిణ కొరియాలోని సియోల్‌లోని ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్-చెకింగ్ నెట్వర్క్, సియోల్ నేషనల్ యూనివర్శిటీ ద్వారా జరిగిన నిజ-నిర్ధారణ సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. ఇద్దరు రచయితలు గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ ఇండియా శిక్షణా నెట్‌వర్క్‌లో భాగం. బీఎన్ సత్య ప్రియ ఒక పోర్టల్ యొక్క ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఇది ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్ వర్క్ సిగ్నెటరీ. ఆమె బిబిసి వరల్డ్ సర్వీస్‌లో ఫ్రీలాన్స్ సీనియర్ పరిశోధకురాలిగా పనిచేశారు. "ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా" పుస్తకం కావలసిన వారు అమెజాన్ లో కొనుగోలు చేసుకునేందుకు అందుబాటులో ఉంది. మరింత సమాచారానికి 9959154371 / 9963980259 సంప్రదించవచ్చు. https://www.amazon.in/Check-Cheyadam-Sudhakar-Reddy-Udumula/dp/9359062057
Next Story