Mon Nov 18 2024 06:34:07 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ సేల్.. ట్రాప్..? ట్రాష్...?
ఫాం హౌస్ లో జరిగిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు పై తెలంగాణ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారింది.
నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంతోనే ప్రభుత్వం కుప్పకూలుతుందా? కూలదు. ఈ నలుగురిని తీసుకుని తిరిగి ఎన్నికలకు వెళ్లాలనుకునే ప్రయత్నమా? కానే కాదు. ఎందుకంటే నలుగురితో ఏం ఒరుగుతుంది. ప్రభుత్వం కూలకపోగా, ఉప ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మునుగోడులోనే వందల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటిది నలుగురి ఎమ్మెల్యేల చేత బీజేపీ రాజీనామాలు చేయించి మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తుందా? అంటే వినడానికే వీక్ గా ఉంది. ఎందుకంటే నలుగురి ఎమ్మెల్యేల్లో ఇద్దరు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు. ఒకరు రంగారెడ్డి, మరొకరు ఖమ్మం జిల్లాకు చెందిన వారు.
బలహీనంగా ఉన్న బీజేపీ...
ఈ జిల్లాల్లో బీజేపీ బలహీనంగా ఉందనే చెప్పాలి. ఇప్పటికే నల్లగొండ జిల్లాలోని మునుగోడులో బలమైన అభ్యర్థి ఉన్నప్పటికీ బీజేపీ అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతతోనే అవస్థలు పడుతున్న బీజేపీ మరో ప్రయోగానికి సిద్ధమవుతుందా? అంటే సందేహంగానే చూడాలి. బీజేపీ తమ పార్టీలోకి తీసుకుంటే గంపగుత్తగా తీసుకుంటుంది. అంతే తప్ప నలుగురైదుగురిని తీసుకుంటే వారి చేత రాజీనామాలు చేయిస్తుంది. కర్ణాటకలో 20 మందికి పైగా కాంగ్రెస్ నేతల చేత రాజీనామాలు చేయించి తిరిగి ఎన్నికకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా డీల్ చేసిన వ్యక్తులు ఎవరో ఇప్పటి వరకూ బయట ప్రపంచానికి ఇప్పటి వరకూ తెలియని వ్యక్తులే. వారికి ఎమ్మెల్యేలను డీల్ చేసేటంత శక్తి, సామర్థ్యం ఉందా? అన్నదీ అనుమానమే. స్వామీజీలు ఎంటర్ అయితే కాషాయ రంగు పులియవచ్చన్నది ఒక టార్గెట్ కావచ్చు.
జోడో యాత్రను...
ఇక తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమయింది. మహబూబ్ నగర్ నుంచి ఆయన ఈరోజు ఉదయాన్నే ప్రారంభించారు. మునుగోడులో కాంగ్రెస్ ప్రస్తుతం రెండో స్థానంలోకి వచ్చిందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను దెబ్బతీయడానికా? అన్న సందేహాన్ని కూడా ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ జోడో యాత్రను డైవర్ట్ చేయడానికి ఫాంహౌస్ డీల్ ను బయటకు తెచ్చారన్న ఆరోపణల్లో ఎంత నిజముందన్నది బయటకు రావాల్సి ఉంది. మునుగోడు ఉప ఎన్నికల్లో అత్యధికంగా నగదు, మద్యం పంపిణీ జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో డైవర్ట్ చేయడానికేనంటున్నారు కాంగ్రెస్ నేతలు.
ఈ ముగ్గురితో సాధ్యమేనా?
రామచంద్ర భారతి కకేరళకు చెందిన తాంత్రికుడు. తాంత్రికుడికి తెలంగాణ పాలిటిక్స్ లో పనేముంటుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మరో వ్యక్తి నందూ అనే వ్యక్తి నందకుమార్ ఒక కమిషన్ ఏజెంట్. అతనికి ఎమ్మెల్యేను డీల్ చేసేంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు ఈ నలుగురు ఎమ్మెల్యేలతో పరిచయం ఎలా కుదరింది? ఇక మరో నిందితుడు సింహయాజి అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం తిరుపతిలో స్థిరపడ్డారు. ఈయనకు బీజేపీతో సంబంధం ఏంటి? ఈయన ఏదో మఠం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అలాంటిది ఈ డీల్ లో ఎలా ప్రముఖ పాత్ర పోషిస్తారు? అన్నది సందేహం. ఇవన్నీ సందేహాలే. వీటిని పటాపంచలు చేయాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. మరి చూడాలి తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న ఈ ఆటలో ఎవరిది పై చేయి అవుతుందనేది.
Next Story