రాజు తలుచుకుంటే ...!!
రాజు తలుచుకుంటే అన్నట్లు వుంది ఆ భారీ ఏర్పాట్లు సాగుతున్న తీరు. సెప్టెంబర్ 2 న టీఆరెస్ తలపెట్టిన ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు మయసభను మరిపిస్తున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి సమీపంలో కొంగరాన్ కొలన్ లోని 600 ల ఎకరాల సువిశాల స్థలం లో ఇప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. బుల్డోజర్లు , ప్రొక్లెయిన్లు, భారీ వాహనాలు చేస్తున్న సందడి చూస్తే ఔరా అనిపించకమానదు. సరికొత్త చరిత్రకు ఈ సభ తో తెరతీస్తామని గులాబీ బాస్ చేస్తున్న ప్రకటనలు తెలంగాణ లో రాజకీయాలకు కాక పుట్టిస్తున్నాయి.
కొత్త రోడ్లు , భారీ భద్రతా ఏర్పాట్లు ...
ప్రగతి నివేదన సభకు 25 లక్షలమంది రావాలన్నది టీఆరెస్ టార్గెట్ గా పెట్టుకుంది. ఆ మేరకు వచ్చే ప్రజలకు అవసరమైన రోడ్లు ఉండాలి. సదుపాయాలు భద్రతా అదే స్థాయిలో చేయాలి. ఇప్పుడు వీటిపై నిర్వాహకులు దృష్టి సారించారు. అప్పటికప్పుడు అప్రోచ్ రోడ్ల నుంచి కొత్త రోడ్లు సిద్ధం చేసేస్తున్నారు. కెసిఆర్ ఎప్పటికప్పుడు శ్రేణులకు దీనిపై ఎక్కడ వున్నా దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఇక విఐపి లు వచ్చి వెళ్ళేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసే ఏర్పాట్లపై కసరత్తు సాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక సభ పర్యవేక్షణ బాధ్యతలను ఉపముఖ్యమంత్రులు మహ్మద్ ఆలీ, నాయిని నర్సింహారెడ్డిలకు గులాబీ బాస్ ప్రత్యేకంగా అప్పగించారు. వారిద్దరు ఈ పనుల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం అయిపోవడంతో శరవేగంగా ప్రగతి నివేదన ఏర్పాట్లు చక చక సాగుతుండటం విశేషం.