అంతా ఉత్తిమాటే.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్
ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది తెలంగాణలో రాజకీయ వేడిదనం పెరిగిపోతోంది. వివిధ పార్టీల నేతల్లో ఉరుకులు పరుగులు మొదలైంది...
ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది తెలంగాణలో రాజకీయ వేడిదనం పెరిగిపోతోంది. వివిధ పార్టీల నేతల్లో ఉరుకులు పరుగులు మొదలైంది. ఆయా పార్టీల నేతలపై రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా ఎన్ని వస్తున్నాయంటే చాలా నేతలు ఇతర పార్టీల్లోకి మారుతున్నట్లు ప్రచారం సాగుతుంటుంది. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పలేనంతగా వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. పార్టీల్లో బడా నేతలు సైతం పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జోరందుకుంటుంది.
తాజాగా టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన, ఆయన భార్య బీఆర్ఎస్ గానీ, బీజేపీలోకి గానీ వెళ్లేందుకు రెడీగా ఉన్నారంటూ పుకార్లు షీకార్లు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ పుకార్లకు క్లారిటీ ఇచ్చారు. ఉత్తమ్. ఇందుకోసం ఓ వీడియోను విడుదల చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ముచ్చటే లేదని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను హుజూర్ నగర్ నుంచి, తన భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీలో ఉంటామని కూడా చెప్పేశారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్నవార్తలను ఎవ్వరు కూడా నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
టీపీసీసీ చీఫ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా అనంతరం కాంగ్రెస్ పార్టీకి కొత్త సారధిగా రేవంత్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. రేవంత్రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని పరిణామాలు సైతం మారిపోయాయి. రేవంత్ రెడ్డి నియామకాన్ని పార్టీలోని సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే కొందరు నేతలు పార్టీని వీడగా.. మరికొందరు వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ మారుతున్నవారిపై దృష్టి సారించిన హైకమాండ్ వారిని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటివి పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. సొంతకుంపటిలోనే విబేధాలు వస్తున్నాయి. మొన్నటి మొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ విషయంపై కూడా జగ్గన్న క్లారిటీ ఇచ్చారు. ఇవన్ని పుకార్లేనని ఖండించారు.