Mon Dec 23 2024 15:54:37 GMT+0000 (Coordinated Universal Time)
బాబు బుల్లెట్ కు కూడా వాళ్లు చిక్కడం లేదట
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికలకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. అయితే నాయకులు మాత్రం పెద్దగా యాక్టివ్ కావడం లేదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. అయితే నాయకులు మాత్రం పెద్దగా యాక్టివ్ కావడం లేదు. ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థుల జాడ లేకుండా పోయింది. ముఖ్యంగా గత ఎన్నికలలో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు ఎవరూ ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గత ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలిచారు. ఓటమి పాలయిన 22 మంది ఎంపీ అభ్యర్థుల్లో నలుగురైదుగురు మినహా ఎవరూ చంద్రబాబుకు అందుబాటులో కూడా లేరు.
కొత్త నేతల ఎంపిక....
దాదాపు పది నుంచి పన్నెండు స్థానాల్లో కొత్త అభ్యర్థులను చంద్రబాబు ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇటీవల చంద్రబాబు సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారని తెలిసింది. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తులు చేస్తున్న చంద్రబాబుకు ఎంపీ అభ్యర్థుల ఎంపిక కొంత ఇబ్బందిగా మారింది. ఇప్పటికే గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు.
పార్టీని వీడటంతో....
ఒంగోలునుంచి పోటీ చేసిన శిద్దా రాఘవరావు, కడప నుంచి పోటీ చేసిన ఆదినారాయణరెడ్డి, నెల్లూరు నుంచి పోటీ చేసిన బీద మస్తాన్ రావు, కాకినాడ నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్, అనకాపల్లి నుంచి పోటీ చేసిన ఆడారి ఆనంద్, బాపట్ల నుంచి పోటీ చేసిన శ్రీరాం మాల్యద్రి లు పార్టీ నుంచి వెళ్లిపోయారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, అరకు నుంచి పోటీ చేసిన కిషోర్ చంద్రదేవ్, నర్సాపురం నుంచి పోటీ చేసిన శివరామరాజులు పార్టీ కార్యక్రమాలకు వివిధ కారణాలతో దూరంగా ఉన్నారు. రాజంపేట, చిత్తూరుల నుంచి పోటీ చేసిన సత్యప్రభ, శివప్రసాద్ లు మృతి చెందారు.
కొందరే యాక్టివ్ గా.....
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన పార్లమెంటు సభ్యుల్లో కొనకళ్ల నారాయణ, అశోక్ గజపతిరాజు, శ్రీభరత్, నిమ్మల కిష్టప్ప, జేసీ పవన్ రెడ్డి లు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. దీంతో మిగిలిన నియోజకవర్గాల్లో కొత్త నేతలను ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆర్థిక, సామాజిక అంశాలను ఆయన పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఎంపీ అభ్యర్థులను కూడా ముందుగానే ఖరారు చేయాలన్న ఉద్దేశ్యంలో చంద్రబాబు ఉన్నారు.
Next Story